రాజన్న సిరిసిల్ల జిల్లాలో అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను పరామర్శించడానికి వెళ్తున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ని సోమవారం టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకోవడం.. ఓ వ్యక్తి ఆయనపై దాడికి పాల్పడటం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం మీడియాతో మాట్లాడిన కేఏ పాల్.. తనపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ హత్యాయత్నం చేయించారని ఆరోపించారు. మంగళవారం డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా పోలీసులు అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేసినట్లు చెప్పారు
సిరిసిల్ల ఎస్పీతో నిన్న కేటీఆర్ మాట్లాడిన తర్వాతే తనపై దాడి జరిగిందని అన్నారు. తనను కొట్టిన వ్యక్తితో పోలీసులు ముందుగా బ్లూటూత్‌తో మాట్లాడారని… ఆ తర్వాతే తనపై దాడి జరిగిందని చెప్పారు. తనపై దాడి చేసింది కేటీఆర్ మనిషేనని అన్నారు.
ఇక ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌తో మాట్లాడానన్నారు కేఏ పాల్. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు 28 సీట్లు కంటే ఎక్కువ రావనే విషయాన్ని కేసీఆర్‌కు చెప్పినట్టు పీకే అన్నారని తెలిపారు. తన ప్రజాశాంతి పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తోందని, తాను ఎక్కడ పోటీ చేసినా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. అయితే తెలంగాణలో ఎక్కడ పోటీ చేస్తానో ఇప్పుడే చెప్పలేనని కేఏ పాల్ అన్నారు.