గ్రేటర్ కాంగ్రెస్ ఖాళీ..! - MicTv.in - Telugu News
mictv telugu

గ్రేటర్ కాంగ్రెస్ ఖాళీ..!

November 21, 2022

రేవంత్ వచ్చారు. పార్టీ కేడర్‌లో జోష్ పెంచారు. కానీ నేతల వలసలు మాత్రం ఆగలేదు. అటు ఆకర్ష్ గులాబీ..ఇటు ఆపరేషన్ కమల్‌కు కాంగ్రెస్ వికెట్లు పడుతూనే ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ దాదాపు ఖాళీ కావొచ్చింది. పేరున్న నేతలకు కమలం వల విసురుతుంది. మర్రిశశిధర్ రెడ్డికి బీజేపీ కండువా కప్పబోతోంది. ఇదే బాటలో మరికొందరు నడుస్తారని భావిస్తోంది.కేడర్‌లో జోష్ నింపిన రేవంత్ గ్రేటర్‌లో తనమార్క్ చూపించలేకపోయారా?వలసల్ని ఎందుకు ఆపలేకపోయారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి గ్రేటర్ కాంగ్రెస్ ఖాళీ అవుతుందా?

పట్టు తప్పిందా?

గ్రేటర్ హైదరాబాద్‌లో కాంగ్రెస్‌కు ఒకప్పుడు మంచి పట్టు ఉండేది. కొన్ని నియోజకవర్గాల్లో ఆ పార్టీకి అప్పట్లో తిరుగులేదు. టీఆర్ఎస్ విసరిన ఆకర్ష్ గులాబీ వలకు కాంగ్రెస్ నేతలు చిక్కారు. ఒక్కొక్కరుగా పార్టీ విడిచివెళ్లారు. సబితాఇంద్రారెడ్డి,దేవిరెడ్డి సధీర్ రెడ్డి,లాంటి నేతలు కారెక్కారు. కూన శ్రీశైలం గౌడ్ , దాసోజు శ్రవణ్, బండ కార్తీకారెడ్డి,విక్రమ్ గౌడ్ లాంటి నేతలు బీజేపీలో చేరారు. అక్కడి నుంచి రెండునెలలకే దాసోజు శ్రవణ్ టీఆర్ఎస్‌లోకి వెళ్లారు. గ్రేటర్‌లో గెలిచిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరిపోయారు. తాజాగా మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నారు. ఇతని బాటలో మరికొందరు నాయకులు వెళ్తారని తెలుస్తోంది. ఊహించని విధంగా కాంగ్రెస్ పై బీజేపీ ఆకర్ష్ కమల్ వల విసిరింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలనాటికి నగర నియోజకవర్గాల్లో కీలక నేతల్ని చేర్చుకోవాలని బీజేపీ భావిస్తోంది.

రేవంత్ వచ్చాక..

రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక కాంగ్రెస్‌లో జోష్ పెరిగింది. కేడర్ ఉత్సాహంగా పనిచేస్తుంది. సీనియర్లు చిటపటలాడుతున్నా రేవంత్ సర్దుకుపోయే ప్రయత్నాలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్ని తట్టిలేపారు. వలసల్ని కాస్తాకూస్తో ఆపే ప్రయత్నాలు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పై మాత్రం రేవంత్ రెడ్డి మార్క్ కనిపించలేదు. రేవంత్ రాకముందు,వచ్చాక కూడా వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. కీలక నేతలు వెళ్లిపోతున్నా గట్టిగా ఆపే ప్రయత్నాలు చేయలేదని ఆ పార్టీ నాయకులు కొందరు చెబుతారు.

ఎవరికివారే

అసలే కాంగ్రెస్. గ్రేటర్ హైదరాబాద్ అంటే ఎవరికివారే తోపులు. ఇక్కడ ఎవరిమాట ఎవరు వినరు. పీసీసీ చీఫ్ ఎవరు ఉన్నా ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేస్తుంటారు. అందుకే గ్రేటర్ పై పెద్దగా రేవంత్ దృష్టి పెట్టలేదని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.ఫలితంగా కాంగ్రెస్ కీలకనేతల్ని చేజార్చుకుంది. నగర కాంగ్రెస్‌కు రెండేళ్లుగా అధ్యక్షుడు లేరు. కాంగ్రెస్ శ్రేణుల్ని నడిపించే నాయకుడే కరువయ్యారు. వరుస ఓటములతో కాంగ్రెస్ డీలా పడిపోయింది. గ్రేటర్ ఎన్నికల్లో ఘోర ఓటమికి బాధ్యత వహిస్తూ అంజన్ కుమార్ యాదవ్ నగర అధ్యక్షుడిగా రాజీనామా చేశారు. ఆ తర్వాత మళ్లీ కొత్త అధ్యక్షుడుని నియమించలేదు.దీనికితోడు సమన్వయలేమి, అసంతృప్తులతో కాంగ్రెస్ గందరగోళంగా మారింది. అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా దూకుడు కొనసాగిస్తున్న రేవంత్ సేన… హైదరాబాద్ పై దృష్టి పెట్టలేకపోయింది. ఫలితంగా ఒక్కొక్కరుగా నాయకులు పార్టీని వీడుతున్నారు.