ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ అరెస్టు.. అసలేం జరిగిందంటే... - MicTv.in - Telugu News
mictv telugu

ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ అరెస్టు.. అసలేం జరిగిందంటే…

July 13, 2017

మహబూబాబాద్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ప్రీతిమీనా చేయి పట్టుకున్న మహబూబాబాద్‌ ఎమ్మెల్యే భానుశంకర్‌ నాయక్‌ను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యే సొంత పూచీకత్తుపైనే స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి విడుదల చేశారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఎందుకిలా కలెక్టర్ల పట్ల అనుచితంగా ప్రవర్తించారు…?ఎంతకాలం నుంచి అమర్యాదగా ప్రవర్తిస్తున్నారు..? అస‌లేం జ‌రిగిందంటే…

మహబూబాబాద్‌లో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో మంత్రి చందూలాల్‌, ఎంపీ సీతారాంనాయక్‌, ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌, కలెక్టర్‌ ప్రీతి మీనాలు పాల్గొన్నారు. ఎన్టీఆర్‌ స్టేడియంలో మొక్కలు నాటారు. ఆ తర్వాత ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ కలెక్టర్‌ ప్రీతిమీనా చేయిపట్టుకొని ముందుకు లాగారు. ఈ సంఘటనపై తీవ్ర మనస్తాపానికి గురైన కలెక్టర్‌ మీనా పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసిన పోలీసులు ఎమ్మెల్యే శంకర్ నాయక్ ను అరెస్టు చేశారు.

వేదికపైకి వెళ్తున్న క్రమంలో ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ తన చెయ్యి పట్టుకున్న విషయాన్ని మీనా వెంటనే మంత్రి చందూలాల్‌కు వివరించగా ఆయన స్పందించలేదు. దీంతో ఆమె రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌కు, ఐఏఎస్‌ల సంఘానికి కంప్లయింట్ చేశారు. కొంతకాలంగా ఎమ్మెల్యే శంకర్ నాయక్ అమర్యాదగా ప్రవర్తిస్తున్నారని.. ఆయన వైఖరితో తాను ఇబ్బంది పడుతున్నానని వాపోయింది. సీఎస్‌, ఐఏఎస్‌ అధికారుల సంఘం ప్రతినిధులు వెంటనే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తూ ఫోన్‌ చేసి శంకర్‌నాయక్‌పై సీరియస్ అయ్యారు. కలెక్టరును కలిసి బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆదేశించారు. తీరు మార్చుకోకుంటే పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తానని హెచ్చరించారు. ఈ విషయంలో కలెక్టరుతో మాట్లాడి సముదాయించాలని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి చందూలాల్‌, ఎంపీ సీతారాంనాయక్‌లకు పురమాయించారు. ఇలాంటి సంఘటనలు రిపీట్ కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. వెంటనే డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి శంకర్‌నాయక్‌ను పిలిచి మాట్లాడి కలెక్టరుకు క్షమాపణలు చెప్పాలని ఆదేశించారు. కలెక్టరు ప్రీతీమీనాను సంప్రదించి.. జరిగిన సంఘటనపై ఆవేదన వ్యక్తంచేశారు. ఇలాంటివి మళ్లీ జరగనీయబోమని హామీ ఇచ్చారు.

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రి చందూలాల్‌, ఎంపీ సీతారాంనాయక్‌ కలెక్టరు ప్రీతీ మీనా ఇంటికెళ్లారు. గంటన్నరపాటు సంప్రదింపులు జరిపారు. అప్పటిదాకా ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ కలెక్టరు ఇంటి బయటే ఉన్నారు. కొంతసేపటికి లోపలి నుంచి పిలుపు రావడంతో ఇంట్లోకి వెళ్లిన ఆయన ఆమెకు క్షమాపణ చెప్పి పది నిమిషాల్లో బయటపడ్డారు. ఆమె తనకు సోదరితో సమానమని, అనుకోకుండా చేయి తగిలి ఉండొచ్చంటూ విలేకరుల దగ్గర వివరణ ఇచ్చారు.

అయినా సారీ చెప్పితే సమస్య సమసిపోతుందా..? ఇప్పుడే కాదు..కొంతకాలంగా అమర్యాదగా ప్రవర్తిస్తున్నాడని కలెక్టర్ చెబుతున్నారు. అంటే ఆమె ఎంత మనో వేదనకు గురి అయిందో అర్థమవుతుంది. మామూలు మహిళాల్లాగే చెప్పుకోలేక నరకయాతన అనుభవించింది. ఓ కలెక్టర్ నే ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఇలా టార్చర్ పెడితే ..మిగతా మామూలు మహిళా అధికారుల పరిస్థితి ఏంటీ..?