అంతేగా.. ట్రంప్‌పై జోకులేసుకున్న దేశాధినేతలు - MicTv.in - Telugu News
mictv telugu

అంతేగా.. ట్రంప్‌పై జోకులేసుకున్న దేశాధినేతలు

December 4, 2019

ఏంటి మీకు అందుకే లేటయిందా? అంటూ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్.. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌ను నవ్వుతూ అడిగారట. ‘ఇది చూసి.. ఆయన టీం సభ్యులు నోరెళ్ల బెట్టారట’ అంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో మరో సందర్భంలో వ్యాఖ్యానించారట. ఏంటీ ఎవరి గురించి అని అనుకుంటున్నారు కదూ. ఇంకెవరి గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించే. వివిధ దేశాధినేతలు ఆయన గురించి ఇలా గుసగుసలు పెట్టారు. అంతేగా, అంతేగా అన్నట్లు అందరూ కిసుక్కున నవ్వుకోవడం. ఈ విషయాన్ని అక్కడి మీడియా సంస్థలు ప్రముఖంగా ప్రచురించడంతో ట్రంప్‌పై జోకులు విషయం బయటకు వచ్చింది. అయితే సదరు దేశాధినేతలు.. ట్రంప్ పేరును ఎక్కడా ప్రస్తావించనప్పటికీ గుసగుస ట్రంప్‌ గురించేనని మీడియా సంస్థలు పేర్కొన్నాయి.  బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో నాటో సభ్య దేశాల అధినేతలు సమావేశమైన సందర్భంగా ఈ సరదా సన్నివేశం చోటు చేసుకుంది.

America.

అంతకుముందు ఏం జరిగిందంటే.. సోమవారం బ్రిటన్‌లోని అమెరికా ఎంబసీలో ట్రంప్ పత్రికా సమావేశం జరిగింది. ఆ రోజు నాటో సెక్రెటరీతో కలసి ట్రంప్ ఫోటోలు దిగే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కేవలం 5 నిమిషాలే కేటాయించడం జరిగింది. కానీ..అనుకోకుండా అదో పత్రికా సమావేశం కింద దాదాపు 40 నిమిషాల పాటు ఈ సమేవేశం సాగింది. దీంతో ట్రంప్ ఆ కార్యక్రమంలో ఉండిపోయారు. ఇదే విషయంపై బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో దేశాధినేతల మధ్య నవ్వులు పూశాయి.

కాగా, దేశాధినేతలపై జోకులు పేలడం షరామామూలే. సోషల్ మీడియా పుణ్యమా అని ఇవి మరీ ఎక్కువయ్యాయి. ఇక ట్రంప్ కూడా ఇందుకు అతీతుడు కారు. మిగితావారితో పోలిస్తే ఆయన విషయంలో నెటిజన్లు కాస్త ఎక్కువ శ్రద్ధ పెడతారు. అయితే ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే.. ఇతర దేశాధినేతలు కూడా ట్రంప్‌పై జోకులు పేల్చడమే.