ట్రంప్ నాలెడ్జ్.. ఇంతకూ మయన్మార్ ఎక్కడుంది! - MicTv.in - Telugu News
mictv telugu

ట్రంప్ నాలెడ్జ్.. ఇంతకూ మయన్మార్ ఎక్కడుంది!

July 19, 2019

చిత్రవిచిత్ర చేష్టలకు, తలతిక్క పనులకు పెట్టింది పేరు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. తప్పులతడకల ట్వీట్లు, మతిలేని మాటలు, కొన్ని వర్గాలను, దేశాలను కించపరచే ప్రకటలతో రోజురోజుకు శత్రువులను బాగా పెంచేసుకుంటున్న ట్రంపుడు తాజాగా తన ‘నాలెడ్జ్’ ఎంతో నిస్సిగ్గుగా బయటపెట్టుకున్నాడు. ఒక దేశాధినేతగా ఎవరూ అడగని ప్రశ్న అడిగి మందబుద్ధి చాటుకున్నాడు. 

విషయంలోకి వెళ్తే.. ట్రంప్ ఇటీవల వైట్ హౌస్ ఓవర్ ఆఫీసులో కొన్ని దేశాల శరణార్థులతో ముచ్చటించారు. మయన్మార్ నుంచి పారిపోయి వచ్చిన రోహింగ్యాలు కూడా వారిలో ఉన్నారు. ఓ రోహింగ్యా మాట్లాడుతూ.. ‘నేను బంగ్లాదేశ్‌లోని శరణార్థుల శిబిరంలో తలదాచుకుంటున్నాను.నాతోపాటు వచ్చిన వాళ్లు త్వరగా స్వదేశానికి పోవాలని కోరుకుంటున్నారు. మాకు మీరెలా సాయం చేస్తారు?’ అని ట్రంప్‌ను అడిగారు. ట్రంప్ చప్పున స్పందిస్తూ.. ‘ఇంతకూ అది(మయన్మార్) ఎక్కడుంది?’ అని అడిగాడు. దీంతో ట్రంప్ సలహాదారు వెంటనే తేరుకుని ‘బంగ్లాదేశ్ పక్కనే ఉంది సర్’ అంటూ తమ నేత పరువు కాపాడుకునే యత్నం చేశాడు.   

ఈ భేటీలో ట్రంప్ మరో విషయంలోనూ పరువు తీసుకున్నాడు. ఐసిస్ అరాచకరాలపై పోరాడినందుకు గాను నోబెల్ శాంతి బహుమతి అందుకున్న నదియా మురాద్‌తో మాట్లాడుతూ ‘మీరు నోబెల్ బహుమతి గ్రహీత కదా? చాలా గొప్ప విషయం. ఇంతకూ మీకు నోబెల్ ఎందుకిచ్చారు?’ అని అడిగాడు. ఆమె ఓపిగ్గా ఆయనకు సమాధానం ఇచ్చింది.