ట్రంప్, బిడెన్ మధ్య మాటల తూటాలు.. అధ్యక్ష అభ్యర్థుల తొలి డిబెట్ - MicTv.in - Telugu News
mictv telugu

ట్రంప్, బిడెన్ మధ్య మాటల తూటాలు.. అధ్యక్ష అభ్యర్థుల తొలి డిబెట్

September 30, 2020

km

అమెరికా అధ్యక్ష అభ్యర్థుల మధ్య తొలి డిబెట్ నిర్వహించారు. బుధవారం ఉదయం 6.30 గంటల సమయంలో ఇది ప్రారంభమైంది దాదాపు 90 నిమిషాల పాటు కీలక అంశాలపై ప్రత్యర్థులు ఇద్దరూ ఆరోపణలు, పత్యారోపణలు చేసుకున్నారు. ఈ సందర్భంగా తాము గెలిస్తే ప్రజలకు చేయబోయే విషయాలను వివరించే ప్రయత్నం చేశారు. కరోనా అంశం ఇద్దరు అధ్యక్షుల మధ్య మాటల తూటాలకు దారి తీసింది. 

మహమ్మారి కరోనాను ఎదుర్కొవడంలో ట్రంప్ ప్రభుత్వం విఫలమైందని బిడెన్ ఆరోపించారు. కనీసం మాస్క్ కూడా ధరించరు అంటూ చురకలు అంటించారు. ఒబామా కేర్ పాలసీ రద్దుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. దీన్ని ట్రంప్ ఖండించారు. తాము ప్రజలకు కరోనా విషయంలో మెరుగైన వైద్యం అందించామని సమర్ధించుకున్నారు. తాను మాస్క్ ధరించట్లేదనే ఆరోపణలను ట్రంప్ తప్పు పట్టారు. మాస్క్‌ ఎప్పుడూ తన వెంటే ఉంటుందని తన జేబులోంచి మాస్క్ బయటకు తీసి చూపించారు. తాను ఎప్పుడూ ప్రజలకు దగ్గరగా ఉంటానని, బిడెన్ తరహాలో 200 మీటర్ల దూరంలో ఉండనని సటైర్ వేశారు. 

సుప్రీం కోర్టు జడ్జీల ఎంపిక, అమెరికా ఆర్థికాభివృద్ధి అంశాలపై చర్చించారు. దీంతో ఇరువురి మధ్య పలు అంశాలపై తొలిముఖాముఖి చర్చ వాడివేడిగా కొనసాగింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు అభ్యర్థుల మధ్య ముఖా ముఖి చర్చ జరుగుతూ ఉంటుంది. 90 నిమిషాల చొప్పున మూడు దఫాలుగా నిర్వహిస్తారు. ఇవే అక్కడి అధ్యక్ష అభ్యర్థి సామర్థ్యాలను ప్రజలకు తెలియజేస్తాయి. ప్రచారం ఒక ఎత్తు అయితే ఈ డిబేట్ మరో ఎత్తుగా భావిస్తారు. కాగా, నవంబర్‌లో ఎన్నికల నేపథ్యంలో అక్టోబర్‌లో మరో రెండు భేటీలు జరగనున్నాయి.