ట్రంప్‌పై తమ్ముడి కూతురు సంచలన ఆరోపణలు - MicTv.in - Telugu News
mictv telugu

ట్రంప్‌పై తమ్ముడి కూతురు సంచలన ఆరోపణలు

July 8, 2020

nvgnv

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ కొన్ని రోజులుగా ఊహించని పరిణామాలు ఎదుర్కొంటున్నారు. తరుచూ వివాదాలు ఆయన్ను చుట్టుముడుతున్నాయి. తాజాగా అతని తమ్ముడికి కూతురు సంచలన ఆరోపణలు చేశారు. వార్టన్‌ బిజినెస్‌ స్కూల్‌లో ప్రతిభ ద్వారా కాకుండా ట్రంప్ అడ్డదారిలో సీటు సంపాదించాడని ఆరోపించారు. ఆమె ఇటీవల రాసిన పుస్తకంలో  ఈ విషయాలను ప్రస్తావించారు. దీంతో ఈ విషయాన్ని అక్కడి మీడియా ప్రచురించడంతో సంచలనంగా మారింది. అధ్యక్ష ఎన్నికలకు కొన్నిరోజుల ముందు ఇలాంటి వివాదాలు రావడం ఆసక్తిగా మారింది. 

ట్రంప్ సోదరుడు జూనియ‌ర్ ఫ్రెడ్‌ కూతురు మేరీ ట్రంప్ ఇటీవల ‘టూ మ‌చ్ అండ్ నెవ‌ర్ ఎనాఫ్.. హౌ మై ఫ్యామిలీ క్రియేటెడ్ వ‌రల్డ్ మోస్ట్ డేంజ‌ర‌స్ మ్యాన్’ అనే పుస్తకం రాశారు. దీంట్లో తన తండ్రితో పాటు ట్రంప్ విషయాలను కూడా ప్రస్తావించారు. ఈ సందర్భంలో పెన్సిల్వేనియాలోని వార్టన్‌ బిజినెస్‌ స్కూల్‌లో అడ్మిషన్‌ పొందడం కోసం ట్రంప్‌ మరొకరితో పరీక్ష రాయించారని పేర్కొన్నారు. దీనికి ప్రతిఫలంగా డబ్బు కూడా ఇచ్చారని ఆరోపించారు. అడ్డదారిలో సీటు సంపాదించడం ద్వారా ప్రతిభగల వ్యక్తికి అందులో అడ్మిషన్ రాకుండా పోయిందని అభిప్రాయపడ్డారు.

ఈ విషయం సంచలనంగా మారడంతో వైట్ హౌజ్ అధికారిక వర్గాలు కూడా స్పందించాయి. మేరీ ట్రంప్ రాసిన విషయాలు వారి ఫ్యామిలీకి సంబంధించినదేనని  అధికారి కెల్యానే కాన్వే అభిప్రాయపడ్డారు. ‘సైకాలజీ చదివిన మేరీకి అధ్యక్షుడు ట్రంప్‌ పేషెంట్‌ కాదు. కుటుంబ విషయాలను కుటుంబ విషయాల్లానే చూడాలి. పుస్తకంలో ఆమె అన్ని అసత్యాలే రాశారు’ అంటూ తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. మేరీ ట్రంప్ రాసిన విషయాలు మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.