వస్తున్నాడయ్యో సామి.. భారత్‌కు ట్రంప్! - MicTv.in - Telugu News
mictv telugu

వస్తున్నాడయ్యో సామి.. భారత్‌కు ట్రంప్!

January 14, 2020

hgnn

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌లో పర్యటించడానికి రంగం సిద్ధమైంది. ఆయన ఫిబ్రవరి నెలాఖార్లో దేశానికి రానున్నారు. వాషింగ్టన్ నుంచి వచ్చే సెక్యూరిటీ అండ్ లాజిస్టిక్ టీమ్స్ వచ్చే వారంలో భారత్‌కు వచ్చి, ట్రంప్ పర్యటనకు ఏర్పాట్లను పరిశీలించనున్నట్టు దౌత్య వర్గాలు తెలిపాయి. ఆయన పర్యటనపై అధికారిక ప్రకటన రానప్పటికీ.. ఆయన భారత్ వస్తున్నట్టు అమెరికా అధికార వర్గాలు సంకేతాలు ఇస్తున్నాయి. ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరగా, ట్రంప్ సున్నితంగా తిరస్కరించారని తెలిసిన విషయమే.

అయితే ట్రంప్ మళ్లీ మనసు మార్చుకున్నారా అంటే అవుననే అంటున్నారు. తాను మరోమారు ఇండియాకు వస్తానని ట్రంప్ హామీ ఇచ్చారు. ఈ హామీని జనవరి 7న జరిగిన ఫోన్ సంభాషణల్లో మోదీ ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ఆ వెంటనే ట్రంప్ భారత పర్యటనకు ఏర్పాట్లు చేయాలని సూచించినట్టు వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. ఫిబ్రవరి చివరి వారంలో ఈ పర్యటన ఉండవచ్చని విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షి ష్రింగ్లా అన్నారు.
ఈ పర్యటనలో నవంబర్ 2018 నుంచి ఇరు దేశాల మధ్య పెండింగ్‌లో ఉన్న పలు వాణిజ్య ఒప్పందాలు కుదిరే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. జూన్ 2019లో ఇండియాకు ఉన్న ‘జీఎస్పీ’ స్టేటస్‌ను అమెరికా రద్దు చేయగా, దాని పునరుద్దరణ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆపై అమెరికాలో ఇండియా పెట్టే పెట్టుబడులు, యూఎస్ నుంచి చమురు ఉత్పత్తుల దిగుమతులను పెంచే అంశాలపై కీలక చర్చలు జరుగుతాయని తెలుస్తోంది.