Trump Says PM Modi "A Great Guy, Doing A Terrific Job"
mictv telugu

ఇండియాకు నేనే బెస్ట్ ఫ్రెండ్, మళ్లీ పోటీ చేస్తా.. ట్రంప్

September 8, 2022

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రశంసలు గుప్పించారు. భారత ప్రధాని చాలా అద్భుతంగా పనిచేస్తున్నారని ఆయన కితాబిచ్చారు. అంతేకాదు, భారత్‌కు తన కంటే మంచి మిత్రుడు ఎవరూ లేరని వ్యాఖ్యానించారు. ప్రముఖ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేసిన డొనాల్డ్ ట్రంప్.. తాను 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తాననే సంకేతాలిచ్చారు.

అన్ని పోల్స్ లోనూ తాను లీడింగ్ లో ఉన్నానని… అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడంపై త్వరలోనే తాను క్లారిటీ ఇస్తానని ట్రంప్ చెప్పారు. జో బైడెన్, బరాక్ ఒబామా, డొనాల్డ్ ట్రంప్ లలో భారత్ కు ఎవరు మంచి మిత్రుడనే ప్రశ్నకు సమాధానంగా… ఈ ప్రశ్నను మోదీని అడగాలని సరదాగా అన్నారు. తన వరకైతే భారత్ తో ట్రంప్ కంటే ఎక్కువ స్నేహం ఎవరూ చేయలేదని చెప్పగలనని తెలిపారు.

కాగా, మళ్లీ అధ్యక్ష పదవి చేపట్టాలని అనుకుంటున్నారా? అని అడిగితే.. ‘‘నేను పోటీచేయాలని అందరూ కోరుకుంటున్నారు..ఎన్నికల్లో నేను ముందంజలో ఉన్నాను.. సమీప భవిష్యత్తులో నేను నిర్ణయం తీసుకుంటాను.. ఈ విషయంలో కొంచెం అనుమానిస్తున్నాను’’ అని వ్యాఖ్యానించారు. భారతీయ సమాజం నుంచి మద్దతు, ప్రధాని నరేంద్ర మోదీతో సంబంధాల గురించి ట్రంప్ మాట్లాడారు. భారత్ తో, మోదీతో తనకు బలమైన అనుబంధం ఉందని చెప్పారు. భారత ప్రధాని పదవిని నిర్వహించడం ఆషామాషీ కాదని… మోదీ అద్భుతంగా పాలిస్తున్నారని అన్నారు. మోదీ చాలా మంచి వ్యక్తి అని చెప్పారు.