టిక్‌టాక్‌పై అమెరికా నిషేధం.. ఆదివారం నుంచి బంద్  - MicTv.in - Telugu News
mictv telugu

టిక్‌టాక్‌పై అమెరికా నిషేధం.. ఆదివారం నుంచి బంద్ 

September 18, 2020

Trump to ban US downloads of TikTok and WeChat

కరోనా వైరస్ కారణంగా డ్రాగన్ చైనాకు అన్నీ దేశాల నుంచి చుక్కెదురు అవుతోంది. యూఎస్‌ యాజమాన్య హక్కులను విక్రయించడానికి షార్ట్ వీడియో షేరింగ్ యాప్‌ టిక్‌టాక్ మాతృ సంస్థ బైట్‌ డ్యాన్స్‌ ఒప్పుకోవడం లేదన్న విషయం తెలిసిందే. విక్రయించడం కన్నా ఆ దేశంలో టిక్‌టాక్‌ను పూర్తిగా నిషేధించడమే కరెక్ట్ అని భావిస్తోంది. అంతేకాకుండా అమెరికా విధించిన గడువుకు తలొగ్గి యూఎస్‌ కార్యకలాపాలను ఆ దేశానికి విక్రయిస్తే.. అమెరికాకు భయపడినట్లు అవుతుందని చైనా భావించింది. అమెరికాలో టిక్‌టాక్‌ను కొనసాగించాలా? నిషేధించాలా? అనే డైలామాలో చైనా పడింది. ఈ నేపథ్యంలో బైట్‌డ్యాన్స్‌కు ఇచ్చిన గడువు పొడిగించేది లేదని ట్రంప్‌ స్పష్టంచేసిన విషయం తెలిసిందే. చైనా కమ్యూనిస్టు ప్రభుత్వ నియంత్రణలో ఉన్న కంపెనీలు చైనా ప్రభుత్వానికి అమెరికా పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని చేరవేస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆరోపించారు. ఈ విషయమై పలువురు అమెరికా చట్టసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సెప్టెంబర్ 15తో ఆ గడువు ముగిసింది. దీంతో టిక్‌టాక్‌పై అమెరికా నిషేధం విధించింది. జాతీయ భద్రతకు ప్రమాదకరమని పేర్కొంటూ.. టిక్‌టాక్‌తో పాటు వీచాట్‌ను నిషేధిస్తున్నట్లు అగ్రరాజ్యం ప్రకటించింది. 

ఈ ఆదివారం నుంచి రెండు యాప్‌ల డౌన్‌లోడ్‌లను నిలిపివేయనున్నట్లు అమెరికా అధికారులు శుక్రవారం వెల్లడించారు. అమెరికాలో టిక్‌టాక్ కార్యకలాపాలను తమ దేశంలోని కంపెనీలకే విక్రయించాలని ట్రంప్ షరతు విధించారు. టిక్‌టాక్‌కు అమెరికాలో 8 కోట్ల మంది యాక్టివ్ యూజర్స్ ఉన్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ విషయమై కామర్స్ సెక్రటరీ విల్బర్ రాస్ మాట్లాడుతూ.. ‘చైనాలోని కమ్యూనిస్టు పార్టీ తమ ఉద్దేశాలను భావాలను చాలా స్పష్టంగా ఈ అప్లికేషన్ల ద్వారా తెలుపుతున్నారు. ఇది కేవలం ఒక్క దేశ భద్రత గోప్యతలకు భంగం కలిగించే విధంగా రూపొందించబడ్డాయి. ఫారిన్ పాలసీ అంశాలను కూడా అతిక్రమిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థపై భారీగా ప్రభావం చూపే అప్లికేషన్లు ఇవి’ అని తెలిపారు. కాగా, టిక్‌టాక్‌తో పోలిస్తే వి చాట్ యాప్‌ను అమెరికన్లు బాగా వాడుతారు. అలాగే అమెరికాలో ఉండే చైనీయులు కూడా దీనితోనే ఎక్కువగా ఒక్కరితో ఒకరు కనెక్ట్ అవుతుంటారు.