ట్రంప్‌తో పాటు వచ్చిన మరో మహిళ ఎవరు?  - MicTv.in - Telugu News
mictv telugu

ట్రంప్‌తో పాటు వచ్చిన మరో మహిళ ఎవరు? 

February 24, 2020

Trump translator gurdeep chawla

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సతీసమేతంగా ఆగ్రాలో పర్యటిస్తున్నారు. తన పర్యటనతో భారత్, అమెరికాల సంబంధాలు బలపడతాయంటున్న ఆయన రేపు రూ. 21 వేల కోట్ల సైనిక పరికరాల ఒప్పందం కుదుర్చుకోనున్నారు. భార్య మెలానియా, కూతురు ఇవాంకా, అల్లుడు జారెడ్ కుష్నర్‌లతో అగ్రరాజ్య అధినేత ఏతెంచారు. అహ్మదాబాద్‌కు ప్రత్యేక విమానంలో చేరుకున్న ట్రంప్ దంపతులకు మన ప్రధాని మోదీ ఘనంగా ఆహ్వానం పలికారు. సబర్మతి ఆశ్రమానికి ట్రంప్ దంపతులతోపాటు వారి పక్కనే నడుచుకుంటూ వచ్చిన మహిళ ఒకరు మీడియాకు ఆసక్తికరంగా మారారు. ట్రంప్ పక్కనే నడుచుకుంటూ వచ్చిన ఆమెను అమెరికా అధికారిగా భావించారు. ఆమెలో భారతీయుల పోలికలు ఉండడంతో ఎవరన్న ఆసక్తి రేగింది. 

గతంలోనూ అగ్రరాజ్య అధ్యక్షుల పర్యటనల్లో కనిపించిన ఆమె భారతీయ అమెరికన్ గుర్దీప్ చావ్లా. ట్రంప్‌కు అమె అనువాదకురాలిగా వచ్చారు. 27 ఏళ్లుగా దుబాసీగా పనిచేస్తున్న గుర్దీప్ భారత పార్లమెంటులోనూ తర్జుమా పనులు నిర్వహించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా 2015లో భారత రిపబ్లిక్ డే వేడుకకు వచ్చినప్పుడు ఆమె  ఆయన వెంట ఉన్నారు. మోదీ ఐక్యరాజ్యసమితిలో చేసిన తొలి ప్రసంగానికి ఆమె అనువాదకురాలు. 2014లో న్యూయార్క్ లోని మేడిసన్ స్క్వేర్ లోని జరిగిన మోదీ సభలోనూ ఆమె ఆయన వెన్నంటి ఉన్నారు. మోదీ, ఒబామాల మధ్య దుబాసీగా వ్యవహరించారు.