నిన్న గోడ కట్టారు.. ఇప్పుడు ఖాళీ చేయాలని నోటీసులు - MicTv.in - Telugu News
mictv telugu

నిన్న గోడ కట్టారు.. ఇప్పుడు ఖాళీ చేయాలని నోటీసులు

February 19, 2020

Trump Visit Reason Eviction Notice to Slum Families

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన పేదల పాలిట శాపంగా మారింది. మురికివాడల్లో ఉంటూ కడుపేదరికాన్ని అనుభవిస్తున్నవారిపై దయ చూపాల్సింది పోయి వారిని దిక్కులేని వారిగా చూస్తున్నారు. ఏళ్ల తరబడి వారు ఉంటున్న స్థలాన్ని ఉన్నపలంగా ఖాళీ చేయాలంటూ అధికారులు నోటీసులు ఇచ్చారు. సుమారు 45 కుటుంబాలకు ఈ నోటీసులు అందాయి. దీంతో తామంతా ఎక్కడికి పోవాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఈ నెల 24న ప్రధాని మోదీతో కలిసి ట్రంప్ గుజరాత్‌లో పర్యటించనున్నారు.  అహ్మదాబాద్‌లోని మొతేరాలో ఆయన రోడ్ షో కూడా ఉండనుంది. దీంతో దారిపొడవునా ఉన్న మురికి వాడలు కనిపించకుండా ఇప్పటికే గోడలు కట్టించారు. ఈ చర్యతో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అయ్యాయి. అంతటితో ఆగకుండా ఇప్పుడు వారందరినీ అక్కడి నుంచి ఖాళీ చేయాలంటూ నోటీసులు కూడా జారీ చేశారు. దీనిపై మరోసారి విమర్శలు వెల్లువెత్తడంతో అధికారులు స్పందించారు. ట్రంప్ పర్యటనకు నోటీసులకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అక్రమంగా నివాసం ఉంటున్నందునే తాము ఇలా చేయాల్సి వచ్చిందని చెబుతున్నారు.