పరీక్షలు తరుముకొచ్చేస్తున్నాయి. ఇంకో రెండు నెల రోజుల వ్యవధిలో పదవ తరగతి పరీక్షలు మొదలవనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో 10వ తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్. కొత్త మోడల్ పేపర్లు అందుబాటులోకి వచ్చాయి. ఈసారి టెన్త్ పరీక్షా ప్రశ్నపత్రాల్లో మార్పులు జరగనున్నాయి. ఈ మేరకు ప్రశ్నపత్రాల్లో మార్పులతో కొత్త మోడల్ పేపర్లను విడుదల చేసింది. ఎన్సీఈఆర్టీ అధికారిక వెబ్సైట్లో మోడల్ పేపర్లను అందుబాటులో ఉంచింది. ఇటీవలే పదోతరగతి పరీక్షల్లో 11 పేపర్లను ఆరుకు తగ్గించిన విషయం తెలిసిందే. ఆ మేరకు 6 పేపర్లకు సంబంధించిన మోడల్ పేపర్లను, బ్లూప్రింట్‌ను విద్యాశాఖ వెబ్సైట్లో అందుబాటులో ఉంచగా.. వ్యాస రూప, సూక్ష్మ రూప ప్రశ్నలు కఠినంగా ఉన్నాయంటూ విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో టెన్త్ ప్రశ్నపత్రంలో మార్పులు తెచ్చారు. అదేవిధంగా పరీక్షకు సంబంధించిన ప్రశ్నలు, సమాధానాలకు మార్కులను తెలియజేసే బ్లూ ప్రింట్‌ను కూడా విడుదల చేశారు.
పరీక్షల విధానంలో మార్పులు చేయాలని.. ఛాయిస్ పెంచాలని ఉపాధ్యాయ సంఘాల నుంచి ఒత్తిడి రావడంతో తాజాగా ఇంటర్నల్ ఛాయిస్‌ను తొలగించింది. ఆరు ప్రశ్నల్లో నాలుగింటికి సమాధానాలు రాయాలని కొత్త ఉత్తర్వుల్లో పేర్కొంది. దీనివల్ల మిగిలిన రెండు సెక్షన్లలో ఒక్కో ప్రశ్నకు మార్కుల కేటాయింపు మారింది. అయితే ఈ మార్పు తెలుగు, ఇంగ్లిష్, హిందీ సబ్జెక్టులకు మాత్రం వర్తించదు. మిగిలిన సబ్జెక్టులైన మ్యాథ్స్, సైన్స్, సోషల్ సబ్జెక్టులకు.. అదీ వచ్చే ఏప్రిల్‌లో జరిగే వార్షిక పరీక్షలతో పాటు 2023-24 విద్యా సంవత్సరానికి మాత్రమే వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మార్పులన్నీ 9వ తరగతికి కూడా వర్తించనున్నాయి.
ఇంతకు ముందు ఎస్సే టైప్ సెక్షన్లో ఇంటర్నల్ ఛాయిస్ మాత్రమే ఉంది. ఇందులో భాగంగా.. వ్యాసరూప ప్రశ్నల్లో 12 ప్రశ్నల్లో 6 ప్రశ్నలకు సమాధానం రాయాల్సి ఉండేది. కానీ, ఇప్పుడు ప్రశ్నల సంఖ్యను ఆరుకు తగ్గించారు. ఇందులో ఏవేనీ నాలుగు ప్రశ్నలకు సమాధానం రాస్తే సరిపోతుంది. ఇదివరకు వ్యాసరూప ప్రశ్నలకు ఒక్కో ప్రశ్నకు ఐదు మార్కులుండగా, ఇప్పుడు ఆరు మార్కులకు పెంచారు. ప్రశ్నల విభాగంలో గతంలో మాదిరిగానే ఇచ్చిన ఆరు ప్రశ్నలకూ సమాధానం రాయాలి. ఈ విభాగంలో గతంలో ఒక్కో ప్రశ్నకు మూడు మార్కులుండగా ఇప్పుడు నాలుగు మార్కులకు పెంచారు. అతి స్వల్ప ప్రశ్నల విభాగంలో గతంలో మాదిరిగానే ఆరు ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు కలిపారు. ఆబ్జెక్టివ్ విభాగంలోనూ గతంలో మాదిరిగానే 20 ప్రశ్నలుంటాయి ఒక్కోదానికి ఒక మార్కు కేటాయించారు.
10వ తరగతి మోడల్ పేపర్లు డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ కిందనున్న లింక్ క్లిక్ చేయండి.
https://scert.telangana.gov.in/