తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల్లో పోస్టు గ్రాడ్యుయేషన్, ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష(సీపీగెట్-2022) నోటిఫికేషన్ను ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్.లింబాద్రి విడుదల చేశారు. ఉస్మానియా, కాకతీయ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన, తెలంగాణ, జేఎన్టీయూ హెచ్, మహిళా వర్సిటీల్లో సీపీగెట్ ద్వారా ప్రవేశాలు కల్పించనున్నారు. నేటి నుంచి జులై 4వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఆలస్య రుసుం రూ.500తో జులై 11వ తేదీ వరకు, రూ.2వేలు ఆలస్య రుసుంతో జులై 15వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని లింబాద్రి తెలిపారు. జులై 20 నుంచి సీపీగెట్ ఆన్లైన్లో ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు.
బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ వంటి సంప్రదాయ కోర్సుల్లో ప్రవేశాలను సీపీగెట్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ 8 విశ్వవిద్యాలయాల పరిధిలోని 320 కళాశాలల్లోని 50 కోర్సుల్లో 44,604 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఏ సబ్జెక్టులో డిగ్రీ చదివిన వారైనా.. సోషల్ సైన్సెస్, లాంగ్వేజెస్ కోర్సుల్లో పీజీ చేసేలా ఈ ఏడాది నిబంధనలు సవరించినట్లు లింబాద్రి తెలిపారు.