టీఎస్ ఎంసెట్, ఏపీ ఎడ్‌సెట్ 2020 ఫలితాలు విడుదల - MicTv.in - Telugu News
mictv telugu

టీఎస్ ఎంసెట్, ఏపీ ఎడ్‌సెట్ 2020 ఫలితాలు విడుదల

October 24, 2020

TS EAMCET 2020 agriculture and medical stream results released.jp

తెలంగాణ ఎంసెట్ మెడికల్ అండ్ అగ్రికల్చర్ ఫలితాలు విడుదల అయ్యాయి. కూకట్‌పల్లి జేఎన్టీయూలో ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి శనివారం మధ్యాహ్నం ఈ ఫలితాలను విడుదల చేశారు. ఎంసెట్ అగ్రికల్చర్ విభాగంలో 92.57 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు పాపిరెడ్డి వెల్లడించారు. 63,857 మంది అభ్యర్థులకు గానూ 59,113 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. ఎంసెట్‌లో తొలి మూడు ర్యాంకులను అమ్మాయిలు సాధించారు. వారిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గుత్తి చైతన్య సింధు తొలి ర్యాంకు సాధించగా, సంగారెడ్డికి చెందిన మారెడ్డి సాయి త్రిషా రెడ్డికి రెండో ర్యాంకు, తుమ్మల స్నికితకు మూడో ర్యాంకు వచ్చింది. నవంబర్‌లో కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.

 

ర్యాంకులు ఇలా.. 

 

-గుత్తి చైతన్య సింధు (మొదటి ర్యాంకు)

-మారెడ్డి సాయి త్రిషా రెడ్డి (రెండో ర్యాంకు)

-తుమ్మల స్నికిత (మూడో ర్యాంకు)

-దర్శి విష్ణు సాయి (నాలుగో ర్యాంకు)

-మల్లిడి రిషిత్ (ఐదో ర్యాంకు)

-చిగురుపాటి శ్రీమల్లిక్ (ఆరో ర్యాంకు)

-ఆవుల సుభాన్ (ఏడో ర్యాంకు)

-గారపాటి గుణ చైతన్య (ఎనిమిదో ర్యాంకు)

-గిండేటి వినయ్ కుమార్ (తొమ్మిదో ర్యాంకు)

-కోట వెంకట్ (పదో ర్యాంకు)

 

ఏపీ ఎడ్‌సెట్‌ 2020 ఫలితాలు ఇలా..

 

ఏపీ ఎడ్‌సెట్ 2020 ఫలితాలు కూడా నేడు విడుదల అయ్యాయి. అక్టోబర్‌ 1న రాష్ట్ర వ్యాప్తంగా 50 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించారు. శనివారం ఆంధ్రా యూనివర్సిటీ ఉపకులపతి ప్రసాదరెడ్డి విశ్వవిద్యాలయంలోని ఐఎఎస్‌ఈ ప్రాంగణంలో బీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఎడ్‌సెట్‌-2020 ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 15,658 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని, వారిలో 10,363 మంది పరీక్షకు హాజరయ్యారని ప్రసాదరెడ్డి తెలిపారు. వీరిలో 10,267 మంది ఉత్తీర్ణత సాధించారని.. మొత్తం 99.07 శాతం అభ్యర్థులు ఎడ్‌సెట్‌‌కు అర్హత సాధించారని వెల్లడించారు. గణితంలో 99.74 శాతం, భౌతిక శాస్త్రంలో 99.41 శాతం, బయోలాజికల్‌ సైన్సెస్‌‌లో 99.03, సాంఘిక శాస్త్రంలో 98.37, ఆంగ్లంలో 98.83 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారని పేర్కొన్నారు.