కరోనా వల్ల గత మూడేళ్ల నుంచి ఎంసెట్‌లో ఇంటర్ మార్కుల వెయిటేజీని రద్దు చేశారు. ఇదే విధానాన్ని ఈ ఏడాది కూడా కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఎంసెట్‌లో ఇంటర్ మార్కుల వెయిటేజీని రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ ఏడాది కూడా ఎంసెట్ ర్యాంకుల ఆధారంగానే ప్రవేశాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటర్‌లో కనీస మార్కులు సాధించాలన్న నిబంధనను యథాతథంగా కొనసాగిస్తున్నట్టు వెల్లడించింది. దీంతో ఇంటర్‌లో జనరల్ విద్యార్థులు 45 శాతం, రిజర్వ్‌డ్ క్యాటగిరీ విద్యార్థులు 40 శాతం మార్కులు సాధిస్తేనే ఎంసెట్‌కు హాజరుకావొచ్చని సూచించింది.
కరోనా ప్రభావం కారణంగా మూడేళ్లుగా ఎంసెట్‌లో ఇంటర్ వెయిటేజీ నుంచి మినహాయింపు ఇచ్చారు. తాజాగా ఈ విద్యాసంవత్సరం ఇంటర్ వెయిటేజీ అంశంపై ఉన్నత విద్యామండలి అధికారులు నిపుణుల కమిటీ వేశారు. ఈ కమిటీ… జేఈఈ సహా ఇతర రాష్ర్టాలను అనుసరిస్తూ ఈ ఏడాది కూడా వెయిటేజీ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించడంతో శుక్రవారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎంసెట్ షెడ్యూల్‌తో పాటు ఇంజనీరింగ్ పీజీ కోర్సులకు సంబంధించిన పీజీఈసెట్ షెడ్యూల్‌ను శుక్రవారం విడుదల చేశారు. జేఎన్టీయూలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి, జేఎన్టీయూ వీసీ కట్టా నర్సింహారెడ్డి తదితరులు ఈ షెడ్యూల్స్ విడుదల చేసి, అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఇంటర్ మార్కుల వెయిటేజీని రద్దు చేశామని, ఎంసెట్ మార్కుల ఆధారంగానే ర్యాంకులు ప్రకటించి ప్రవేశాలు కల్పిస్తామని తెలిపారు. మార్చి 3వ తేదీ నుంచి ఏప్రిల్ 4 వరకు ఆన్‌లైన్‌లో ఎంసెట్ దరఖాస్తులను స్వీకరిస్తామని వెల్లడించారు. 28న ఎంసెట్ నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామని తెలిపారు. ఈ సంవత్సరం బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో సీట్లను కూడా ఎంసెట్ ర్యాంకుల ఆధారంగానే భర్తీ చేస్తామని స్పష్టంచేశారు. దరఖాస్తు, ఫీజు ఇతర వివరాలకు www. eamcet. tsche.ac.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.