నన్ను ఆపే శక్తి ఎవరికీ లేదు.. మహిళా దర్బారులో గవర్నర్ - MicTv.in - Telugu News
mictv telugu

నన్ను ఆపే శక్తి ఎవరికీ లేదు.. మహిళా దర్బారులో గవర్నర్

June 10, 2022

రాష్ట్రంలోని మహిళల సమస్యలు తెలుసుకోవడానికి తెలంగాణ గవర్నర్ తమిళిసై శనివారం రాజ్‌భవన్‌లో మహిళా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకు ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. ‘గవర్నర్ ప్రజలను కలవడమేంటీ? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. కరోనా సమయంలో సెక్యూరిటీ వాళ్లు వద్దని చెప్తున్నా నిమ్స్ ఆస్పత్రికి వెళ్లి రోగులను కలిశాను. తెలంగాణ మహిళలకు ఒక సోదరిలా వారికి అండగా ఉంటాను. మహిళలు, ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేస్తా. నా పనులకు ఎవరు అడ్డు చెప్పినా వెనకడుగు వేయను. ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న నన్ను ఎవరూ అడ్డుకోలేరు. సమస్యలపై నా స్వరాన్ని ప్రభుత్వానికి బలంగా వినిపిస్తా’నని వ్యాఖ్యానించారు. కాగా, ఈ కార్యక్రమం నిర్వహించడంపై టీపీసీసీ అధ్యక్షుడు స్వాగతించగా, సీపీఐ నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వంతో ఏర్పడ్డ కొన్ని అభిప్రాయ బేధాల తర్వాత నిర్వహిస్తున్న కార్యక్రమం అవడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. ఇంతకు ముందు గవర్నర్ ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి రాజ్‌భవన్ ఎదుట గతంలో ఫిర్యాదుల పెట్టెను ఏర్పాటు చేశారు. అంతకు ముందు ప్రజా దర్బార్ నిర్వహించారు.