TS Governor Quetions To TS Govt
mictv telugu

ప్రభుత్వానికి గవర్నర్ పది ప్రశ్నలు

November 9, 2022

TS Governor Quetions To TS Govt

రాజ్‌భవన్‌కు ప్రగతిభవన్‌కు మధ్య వార్ మరింత ముదిరింది. తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ తమిళి సై ప్రశ్నల వర్షం కురిపించారు. యూనివర్సిటీ రిక్రూట్ బోర్డు బిల్లుపై ప్రశ్నలు సంధించారు. అంతేకాదు తెలంగాణ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని తమిళి సై ఆరోపించారు. ఫామ్‌హౌస్ ఫైల్స్ కేసులోనూ రాజ్‌భవన్‌ను లాగాలని చూశారన్నారు. రాజ్‌భవన్ ముందు ఆందోళన చేస్తామన్న జేఏసీహెచ్చరికల వెనుక ఉన్నదెవరని ఆమె ప్రశ్నించారు. తమిళి సై ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానాలు ఏంటి? ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల్ని ఎలా చూడాలి?ప్రధాని మోదీ టూర్‌కు ముందు తెలంగాణలో ఏం జరగబోతోంది.

గవర్నర్ ప్రశ్నల వర్షం

తెలంగాణ గవర్నర్ తమిళి సై ఘాటైన పదజాలంతో సంచలన వ్యాఖ్యలతో ప్రెస్ మీట్ నిర్వహించారు.దాదాపు గంటసేపు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వానికి ప్రశ్నలు సంధిస్తూనే సంచలన ఆరోపణలు చేశారు. యూనివర్సిటీ రిక్రూట్ మెంట్ బిల్లుతో మొదలైన ప్రెస్ మీట్ ఫామ్‌హౌస్ ఫైల్స్ మీదుగా సాగింది. అన్ని యూనవర్సిటీల వీసీలతో మాట్లాడానని తమిళి సై చెప్పారు. ఆ తర్వాత బిల్లు పై సందేహాల్ని నివృత్తి చేయాలని కోరానన్నారు. గవర్నర్ తమిళి సై సంధించిన ప్రశ్నలు..

1. కొత్తగా రిక్రూట్ మెంట్ బోర్డు ఎందుకు?

2. బోర్డు ఏర్పాటుతో ఎలాంటి ఇబ్బందులు వస్తాయి?

3.యూజీసీ నిబంధనలకు లోబడి ఉంటుందా?

4. లీగల్‌గా ఇబ్బందులు వస్తే పరిస్థితి ఏంటి?

5. ఏటా నియామకాలు ఉంటాయా?

6.బోర్డు ఏర్పాటులో ఎలాంటి ప్రోటోకాల్ పాటిస్తారు

7.జేఏసీ ఆందోళనల వెనుక ఎవరు ఉన్నారు?

8.వారిని రెచ్చగొడుతున్నదెవరు?

9.క్లారిఫికేషన్ అడిగితే తప్పుడు ప్రచారం చేస్తారా?

10.అనవసర విషయాల్లోకి రాజ్ భవన్‌కు ఎందుకులాగుతున్నారు?

తుషార్..నా ఏడీసీగా పనిచేశారు…

గవర్నర్ తమిళి సై ఇక్కడితోనే ఆగలేదు. ఫామ్‌హౌజ్ ఫైల్స్ కేసుపై మాట్లాడారు. అనవసరంగా రాజ్‌భవన్‌ని ఈ కేసులోకి ఎందుకు లాగుతున్నారని ప్రశ్నించారు. తుషార్ తన దగ్గర ఏడీసీగా పనిచేశారని స్పష్టం చేశారు. ఈ మాత్రానికే రాజ్‌భవన్ కేసులోకి లాగుతారా అని తమిళిసై ఫైర్ అయ్యారు.

ప్రగతిభవన్‌లా కాదు

రాజ్‌భవన్‌కు ఎవరు వచ్చినా మాట్లాడుతానని తమిళిసై అన్నారు. ఎవరైనా వచ్చి కలువొచ్చని చెప్పారు. రాజ్‌భవన్ ప్రగతిభవన్ లా కాదన్నారు. ప్రజలు వచ్చి సమస్యలు చెప్పుకుంటున్నారని, వింటే తప్పేంటని ప్రశ్నించారు. రాజ్‌భవన్‌కు ఎవరొచ్చినా మాట్లాడుతానని స్పష్టం చేశారు.

ట్యాపింగ్ అనుమానాలు

తన ఫోన్‌ని ట్యాపింగ్ చేస్తున్నారని అనుమానాలు ఉన్నాయని గవర్నర్ తమిళి సై అన్నారు. ఫామ్‌హౌస్ కేసులోకి రాజ్‌భవన్ ని లాగేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.అసలే అంతంత మాత్రంగా ఉన్న రాజ్ భవన్ , ప్రగతిభవన్ మధ్య సంబంధాలు మరిత దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. ప్రధాని మోదీ రామగుండం టూర్‌కు ముందు తమిళి సై సంధించిన ప్రశ్నలు తెలంగాణలో కాక పుట్టిస్తున్నాయి. ప్రభుత్వ సమాధానం ఎలా ఉంటుందో చూడాలి.