సంబురాల వేళ..ఉద్యోగాల జాతర..! - MicTv.in - Telugu News
mictv telugu

సంబురాల వేళ..ఉద్యోగాల జాతర..!

May 30, 2017

తెలంగాణ రాష్ట్రావతరణ సంబురాల వేళ నిరుద్యోగులకు కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. సత్వరమే 20 వేలకు పైగా ఉద్యోగ నియామకాలు చేపట్టాలని నిర్ణయించింది. వీలైనంత త్వరలో నియామకాలు జరగాలని ఆదేశించింది. పోస్టుల పూర్తి వివరాలు ఇవే…

ప్రభుత్వ విద్యాసంస్థల్లో బోధన, బోధనేతర సిబ్బంది నియామకానికి సంబంధించి సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, జగదీష్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.సింగ్ పాల్గొన్నారు. వివిధ విద్యాసంస్థల్లో 20వేలకు పైగా ఉద్యోగాల నియామకాలకు సంబంధించి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని చెప్పిన కేసీఆర్ వాటి ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. వీటిలో కొన్నిటికి నోటిఫికేషన్ జారీ చేశామని, మరికొన్నింటికి త్వరలో నోటిఫికేషన్ ఇస్తున్నామని, మరికొన్ని నియామకాలు వారంలో జరుగుతాయని ఘంటా చక్రపాణి వివరించారు. ఉద్యోగులను నియమించే ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని, అన్ని నియామకాలకు సంబంధించిన ప్రక్రియ వారంలోగా ప్రారంభం కావాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

కె.జి.బి.వి. ల్లో 1428 ఉద్యోగాలు :

రాష్ట్రంలో కొత్తగా 84 కస్తూరిభా గాంధి బాలికల విద్యాలయాల్లో 1428 ఉద్యోగాలు. 840 మంది బోధన, 588 మంది బోధనేతర సిబ్బంది నియామాకం
అర్బన్ రెసిడెన్షియల్స్ లో 377:

అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్లలో 377 ఉద్యోగాల నియామకం. వీటిలో 174 మంది బోధన, 203 మంది బోధనేతర సిబ్బంది.
రెసిడెన్షియల్ స్కూళ్లలో 7,300 టీచర్లు:

కొత్తగా ప్రారంభిస్తున్న రెసిడెన్షియల్ స్కూళ్లలో 7,300 మంది టీచర్ పోస్టులు. మే 31న పరీక్ష. పరీక్ష ముగిసిన వెంటనే నియామకాలు
పాఠశాలల్లో 8,792 టీచర్ పోస్టులు:

రాష్ట్రంలోని వివిధ పాఠశాలల్లో 8,792 మంది టీచర్ పోస్టుల నియామకం. వెంటనే నోటిఫికేషన్ జారీ
కాలేజీలు, ప్రభుత్వ శాఖల్లో 2,437 పోస్టుల భర్తీకి జూన్ 2న నోటిఫికేషన్:

సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్, డిగ్రీ కళాశాలలు, ఇతర ప్రభుత్వ శాఖల్లో 2,437 పోస్టులు. జూన్ 2న నోటిఫికేషన్. వీటిలో లెక్చరర్లు, ప్రిన్సిపాళ్లు, సివిల్ ఇంజనీర్లు, వెటర్నరీ అసిసెంట్ల పోస్టులు.

ఇక ఎప్పటికప్పుడు ఏర్పడే ఖాళీలను గుర్తించి, వాటి భర్తీకి వెంటనే చర్యలు తీసుకోవడానికి నిరంతరం సమీక్షలు నిర్వహించాలని పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ చక్రపాణిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ఎప్పటికప్పుడు సంప్రదించి, అధికారుల సమన్వయంతో ఖాళీలను గుర్తించాలని, పోస్టులను భర్తీ చేయాలని సూచించారు.

రాష్ట్రావతరణ సంబురాల వేళ ఉద్యోగ కబరు అందించడంపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ 20 వేల పోస్టులతో పాటు వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాల్ని భర్తీ చేయాలని కోరుతున్నారు.