TS HC Dismissed The OMC Case Against The IAS Officer srilakshmi
mictv telugu

ఓఎంసీ కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మికి ఊరట

November 8, 2022

ఓబులాపురం మైనింగ్ కంపెనీ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీ లక్ష్మికి భారీ ఊరట లభించింది. ఈ కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఆమెకు క్లీన్ చిట్ ఇస్తూ న్యాయస్థానం తీర్పును వెల్లడించింది. సీబీఐ వాదనకు తగిన ఆధారాలు లేకపోవడంతో కేసును హైకోర్టు కొట్టేసింది. ప్రస్తుతం ఆమె ఏపీలోనే విధులు నిర్వర్తిస్తున్నారు. హైకోర్టు తీర్పుతో ఏపీ చీఫ్ సెక్రటరీగా నియమితులు అయ్యేందుకు శ్రీ లక్ష్మికి అడ్డుంకులు తొలగాయి.

గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గనుల శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న ఆమెపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి నుంచి భారీగా లంచం తీసుకొని అనుమతులు ఇచ్చారని 2011లో అరెస్ట్ చేసారు. ఈ కేసులో ఆమె ఆరో నిందితురాలుగా ఉన్నారు. ఈ మేరకు దర్యాప్తు చేసిన సీబీఐ 2012లో ఛార్జిషీట్ కూడా దాఖలు చేసింది. దీనిపై దర్యాప్తు సమయంలో శ్రీలక్ష్మి ఏడాది పాటు చంచల్ గూడ జైలులో ఉన్నారు. ఆ అరెస్టు ఘటనతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీలక్ష్మిని సస్పెండ్ చేసింది. జైలు నుంచి బెయిల్‌పై విడుదలయిన తర్వాత సస్పెన్షన్‌ను ప్రభుత్వం ఎత్తి వేసింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో అఖిల భారత సర్వీసు అధికారుల విభజన సందర్భంగా శ్రీలక్ష్మిని తెలంగాణకు కేటాయించారు. ఆమె పోస్టల్ అడ్రస్‌ తెలంగాణలో ఉండడంతో ఆమెను తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వానికి కేటాయించింది. అయితే, 2014లో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు వెళ్లేందుకు ప్రయత్నించగా.. కేంద్ర ప్రభుత్వం అందుకు నిరాకరించింది. ఆ నిర్ణయంపై శ్రీలక్షి కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ ను ఆశ్రయించారు. ఆమె తన సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని దానికి సంబంధించిన ఆధారాలను అందజేశారు. తన తండ్రి రైల్వే జాబ్ కారణంగా.. తాము హైదరాబాద్ లో ఉండాల్సి వచ్చిందని.. తన సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని స్పష్టం చేశారు. అక్కడ అన్ని రుజువు చేయడంతో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఆమెను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ చేసింది.