అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్పై కొనసాగుతున్న సస్పెన్స్
ఏపీ మాజీ మంత్రి వివేక హత్య కేసులో వైసీపీ కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో శనివారం సైతం వాదనలు కొనసాగనున్నాయి. శుక్రవారం అవినాష్, సునీత తరఫున అడ్వొకేట్లు దాదాపు 6 గంటల పాటు వాదనలు వినిపించారు. ఇవాళ సీబీఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపించనున్నారు. అనంతరం ముందస్తు బెయిల్పై కోర్టు తీర్పు వెలువరించే అవకాశముంది. దాని ఆధారంగా సీబీఐ ముందుకెళ్లనుంది. ఒకవేళ కోర్టు ముందస్తు బెయిలుకు నిరాకరిస్తే అధికారులు ఆయనను వెంటనే అరెస్ట్ చేసే అవకాశముంది.
ముగియనున్న గడువు
ఇదిలా ఉంటే అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ నుంచి ఈ నెల 27వరకు మినహాయింపు కోరారు. ఈ మేరకు దర్యాప్తు సంస్థకు రెండుసార్లు లేఖ రాశారు. అయితే అధికారులు మాత్రం అవినాష్ లెటర్పై స్పందించలేదు. ఈ క్రమంలో ఏ క్షణమైనా ఆయనను అరెస్ట్ చేస్తారన్న ఊహాగానాలు వినిపించాయి. లేఖపై సీబీఐ అధికారులు స్పందించకపోయినా ఇవాళ్టితో అవినాష్ రెడ్డి అడిగిన ఆ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో దర్యాప్తు సంస్థ ఆయనకు మరోసారి నోటీసులు జారీ చేసే అవకాశముంది.
ఏఐజీలో అవినాష్ తల్లి
మరోవైపు కర్నూలులోని విశ్వభారతి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న అవినాష్ రెడ్డి తల్లి లక్ష్మమ్మను హైదరాబాద్ లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీకి తరలించారు. కార్జియాలజిస్ట్ డాక్టర్ ప్రసాద్ రెడ్డి టీం ఆధ్వర్యంలో ఆమెకు ట్రీట్ మెంట్ కొనసాగుతోంది. తల్లి బాగోగులు చూసుకునేందుకు అవినాష్ రెడ్డి సైతం ఏఐజీ హాస్పిటల్లోనే ఉన్నారు.
నిమ్స్కు భాస్కర్ రెడ్డి
వైఎస్ వివేక హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డి శుక్రవారం అనారోగ్యం పాలయ్యారు. ఆయనకు ఒక్కసారిగా బీపీ పెరగడంతో చికిత్స కోసం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్న భాస్కర్ రెడ్డిని వైద్య పరీక్షలు, చికిత్స్ కోసం ఇవాళ నిమ్స్ కు తరలించే అవకాశముంది.