టెన్త్ క్లాస్ తర్వాత పాలిటెక్నిక్ చదవాలనుకునేవారికి.. గుడ్ న్యూస్. తాజాగా పాలిటెక్నిక్ కాలేజీల్లో సీట్ల భర్తీకి TS POLYCET 2023 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఏడాది జనవరి 16 నుంచి ఏప్రిల్ 24 వరకు ఎలాంటీ లేట్ ఫీ లేకుండా అప్లై చేసుకోవచ్చు. ప్రస్తుతం పదోతరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కంపార్ట్మెంటల్ పద్ధతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మే 17న ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు కన్వీనర్ డాక్టర్ శ్రీనాథ్ తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలల్లోని డిప్లొమా సీట్లను పాలిసెట్ ర్యాంకు ఆధారంగా భర్తీ చేస్తారు. మరిన్ని వివరాలకు.. https://polycet.sbtet.telangana.gov.in/ వెబ్సైట్ను సందర్శించవచ్చు.
పది రోజుల్లో ఫలితాలు
పాలిసెట్ ద్వారా డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్, వెటర్నరి, హార్టికల్చర్, అగ్రికల్చర్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. పరీక్ష నిర్వహించిన 10 రోజుల్లో ఫలితాలు వెల్లడించనున్నట్లు అధికారులు ప్రకటించారు.
ఎస్సీ,ఎస్టీలకు రూ.250 మాత్రమే
ఈసారి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫీజు కాస్త పెంచారు అధికారులు. జనరల్, బీసీ విద్యార్థులకు ఇప్పటివరకు రూ.450 ఉండగా దాన్ని రూ.500లకు పెంచారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు గతంలో మాదిరిగానే రూ.250 రుసుమే ఉంది.
పరీక్ష విధానం
మొత్తం 150 మార్కులకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులతో పదోతరగతి సిలబస్ ప్రకారం ప్రశ్నలు ఇస్తారు. ఇందులో మ్యాథ్స్-60 మార్కులు, ఫిజిక్స్-30, కెమిస్ట్రీ-30 మార్కులు, బయాలజీ-30 మార్కుల చొప్పున ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 2.30 గంటలు ఉంటుంది.