తెలంగాణ రాష్ట్రంలో టీఎస్ ఆర్టీసీ ప్రయాణికులను దృష్టిలో ఉంచుకొని, సంచలన నిర్ణయాలు తీసుకొంటొంది. వేసవి కాలంలో జరగబోయే పండగలకు, జాతరలకు ప్రత్యేక బస్సులో వసూలు చేసే ఛార్జీలను 25శాతానికి తగ్గించిన యాజమాన్యం శనివారం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
రాష్టవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు ప్రభుత్వం ఇటీవలే పోలీసు శాఖలో ఉన్న 17,291 పోస్టులకు, 503 గ్రూప్ -1 పోస్టులకు ప్రకటనలు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్యోగార్థులు కోచింగ్ తీసుకునేందుకు గ్రామాలు, పట్టణాల నుంచి రాజధాని హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో ఉద్యోగార్థుల సౌకర్యార్థం కోసం టీఎస్ ఆర్టీసీ బంపరాఫర్ ప్రకటించింది. హైదరాబాద్ నగరంలో కోచింగ్ తీసుకునే వారి కోసం బస్ పాసుల్లో 20 శాతం రాయితీ కల్పిస్తూ శనివారం ప్రకటన విడుదల చేసింది.
ఆ ప్రకటనలో.. ఉద్యోగార్థుల కోసం జీబీటీ ఆర్డినరీ, జీబీటీ మెట్రో ఎక్స్‌ప్రెస్ పాసులపై రాయితీని ప్రకటించింది. జీబీటీ ఆర్డినరీ పాసును రూ. 2,800లకు, జీబీటీ మెట్రో ఎక్స్‌ప్రెస్ పాస్‌ను రూ. 3,200లకు అందించనున్నట్లు పేర్కొంది. ఈ సేవలు ఈరోజు నుంచే హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలోని అన్ని బస్‌పాస్ కేంద్రాల్లో ఈ పాస్‌లు తీసుకోవచ్చు అని ఆర్టీసీ అధికారులు తెలిపారు. బస్‌పాస్ పొందాలనుకునే వారు ఆధార్ కార్డు, అన్ ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ కార్డుతోపాటు, కోచింగ్ సెంటర్ ఐడీ కార్డును జతపరిచి, కౌంటర్లో ఇస్తే, క్షణాల్లోనే బస్‌పాస్ ఇస్తారని ఆర్టీసీ అధికారులు తెలిపారు.