టీటీడీ భక్తులకు టీఎస్‌ ఆర్టీసీ శుభవార్త.. రోజుకు 1000 - MicTv.in - Telugu News
mictv telugu

టీటీడీ భక్తులకు టీఎస్‌ ఆర్టీసీ శుభవార్త.. రోజుకు 1000

June 5, 2022

తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు తెలంగాణ ఆర్టీసీ ఓ శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్రం నుంచి వెంకన్న స్వామి దర్శనం కోసం తిరుపతికి వెళ్లే భక్తుల కోసం ఇక నుంచి రోజుకు 1000 మందికి రూ. 300 దర్శన టికెట్లు జారీ చేయనున్నారని, రోజుకు వెయ్యి మందికి టికెట్లు జారీ చేసేందుకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అంగీకరించారని టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ తెలిపారు. తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు కావాలనుకున్న వారు ప్రయాణానికి రెండు రోజుల ముందు టీఎస్ ఆర్టీసీ బస్సుల్లో టికెట్ రిజర్వేషన్ చేయించుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ ప్రకటనతో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న టీటీడీ భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీటీడీకి వెళ్లి, టికెట్ల కోసం క్యూ నిలబడి గంటలు గంటలు వేచి చూసే అవకాశం లేకుండా కేవలం మూడు వందల రూపాయలతో వెంకన్న స్వామి దర్శనాన్ని కల్పించే అవకాశాన్ని కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల భక్తులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవలే తిరుమల శ్రీవారి దర్శనం కోసం సర్వ దర్శనం క్యూ కాంప్లెక్స్‌లో తోపులాట జరిగి, భక్తులు ఒకరిపై మరొకరు గొడవకు దిగిన విషయం తెలిసిందే. స్వామివారిని త్వరగా దర్శనం చేసుకోవాలనే తొందరలో వేగంగా వెళ్తూ, ఒకరిపై మరొకరు పడిపోయారు. ఆడవారిపై పడిపోవడం ఏంటని వృద్ధుడు ప్రశ్నించగా, ఆగ్రహించిన ఓ యువకుడు ముక్కు, దవడలపై గుద్ది రక్తం వచ్చేలా కొట్టాడు. దాంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, విషయం తెలుసుకున్న విజిలెన్స్ సిబ్బంది హుటాహుటిన చేరుకొని గొడవను సద్దుమణిగేలా చేశారు. ఈ క్రమంలో తెలంగాణ ఆర్టీసీతో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చర్చలు జరిపి, తెలంగాణ నుంచి తిరుమలకు వచ్చే భక్తులకు ఆర్టీసీ ద్వారా రోజుకు 1000 మందికి దర్శన టికెట్లు కల్పించే అవకాశాన్ని కల్పించారు.