TS RTC good news for TTD devotees..start from today
mictv telugu

టీటీడీ భక్తులకు టీఎస్ ఆర్టీసీ శుభవార్త..నేటి నుంచే షురూ

July 1, 2022

తెలంగాణ ఆర్టీసీ టీటీడీ భక్తులకు శుభవార్తను చెప్పింది. తెలంగాణ రాష్ట్రం నుంచి తిరుమలకు వెళ్లే భక్తులకు బస్‌ టికెట్‌ రిజర్వేషన్ సమయంలో దర్శనం టిక్కెట్టును బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సదుపాయం శుక్రవారం (నేటి) నుంచే అమలులోకి రానుందని పేర్కొన్నారు. కావున తిరుమలకు వెళ్లే భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండీ సజ్జనార్‌ కోరారు.

చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌ మాట్లాడుతూ..” తెలంగాణ నుంచి వెంకన్న స్వామి వారిని దర్శించుకోవటం కోసం తిరుమలకు వెళ్లే భక్తులకు టీఎస్ ఆర్టీసీ దర్శన టోకెన్‌‌ను పొందే వీలు కల్పిస్తుంది. ఆర్టీసీ బస్సులో తిరుమలకు టిక్కెట్టు రిజర్వేషన్ చేసుకునే సమయంలోనే దర్శనం టిక్కెట్టు కూడా బుక్ చేసుకున్న ప్రయాణీకులకు ఈ ప్రత్యేక సదుపాయం అందుబాటులో ఉంటుంది. ఈ దర్శన టికెట్లను ఆర్టీసీ వెబ్‌సైట్‌ లేదా అధీకృత డీలర్‌ ద్వారా రిజర్వు చేసుకోవచ్చు. బస్‌ టికెట్‌తోపాటే దర్శన టికెట్‌ను కూడా బుక్‌ చేసుకోవాలి. ఇందుకు సంబంధించి తాజాగా టీఎస్‌ ఆర్టీసీ, టీటీడీల మధ్య అంగీకారం కుదిరింది” అని ఆయన అన్నారు.

మరోపక్క నేటి నుంచి ప్రతీరోజూ 1000 టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని, ఈ సౌకర్యం కూడా శుక్రవారం నుంచే అమలులోకి వస్తుందని ఆర్టీసీ అధికారులు సూచించారు. తిరుమలకు వెళ్లే భక్తులు www.tsrtconline.in ఆన్‌లైన్ లేదా టికెట్ బుకింగ్ కౌంటర్లలో ఈ ప్యాకేజీని పొందాలని కోరారు. టెక్కెట్టు కావాలని అనుకున్న భక్తులు కనీసం 7 రోజుల ముందుగానే బుక్ చేసుకోవాలని అధికారులు వివరాలను వెల్లడించారు.