మరోసారి భారీగా పెరగనున్న ఆర్టీసీ ఛార్జీలు? - MicTv.in - Telugu News
mictv telugu

మరోసారి భారీగా పెరగనున్న ఆర్టీసీ ఛార్జీలు?

June 24, 2022

తెలంగాణ ఆర్టీసీ ప్రయాణీకులకు మరో షాక్ ఇవ్వనుంది. ఇప్పటికే రౌండర్ ఛార్జీలు, టోల్ సెస్, ప్యాసింజర్ సేఫ్టీ, డీజిల్ సెస్ లాంటి పేర్లతో ఛార్జీలు భారీగా పెంచేసిన ఆర్టీసీ.. మరోసారి ఛార్జీల పెంపునకు సిద్ధమైంది. ఇన్ని ఛార్జీలు పెంచినా ఇంకా నష్టాలు వస్తున్నాయని చెబుతున్న ఆర్టీసీ యాజమాన్యం 20-30శాతం మేర టిక్కెట్ ఛార్జీలు పెంచుకునేందుకు ప్రభుత్వాన్ని అనుమతి కోరుతోంది. దీనిపై కొద్దినెలల క్రితమే ప్రతిపాదనలు పంపిన అధికారులు.. వాటిని ఆమోదించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దీనిపై ఆమోదం రాగానే ఛార్జీలు పెంచుతామని చెబుతున్నారు.

టికెట్ ధరల పెంపుపై ప్రతిపాదనలు పూర్తి చేశారని అధికారవర్గాలు చెప్తున్నాయి. ఈ ప్రతిపాదనల ప్రకారం 100 కిలోమీటర్ల లోపు 30 శాతం టికెట్ ధరలు పెరుగనున్నాయి. పల్లె వెలుగు, ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్ బస్సులకు ఇది వర్తించనుంది.ఇక దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల టికెట్ ధర 20 శాతం వరకు ఉండనుంది. డీలక్స్, లగ్జరీ, సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ వంటి బస్సులకు 20 శాతం పెంపు ఉండనుంది. దీంతో రోజువారీ నష్టం తగ్గుతుందని అధికారులు అంచనా వేశారు. ఇలా పెంచినా సగటున కిలోమీటరుకు టికెట్ పై రూ. 2 నుంచి రూ. 3 వరకు పెరుగుతుందని అధికారులు ఆఫ్ ది రికార్డు చెప్తున్నారు. దీనిపై ఇటీవల మంత్రి, ఆర్టీసీ చైర్మన్, ఎండీ సమక్షంలో సమీక్షించినట్లు తెలుస్తోంది. ఆర్డినరీ, సిటీ బస్సులపై కిలోమీటరుకు 25 పైసలు, ఆపై బస్సులపై 30 పైసలు చొప్పున ప్రతిపాదించినట్లు మంత్రి అజయ్ కూడా గతంలోనే ప్రకటించారు. మినిమం చార్జీపై రూ.5 వరకు పెంచాలనే ప్రతిపాదనలు కూడా సీఎంకు ఇచ్చినట్లు తెలిపారు. వీటిలో కొన్ని మార్పులు చేసి, మరోసారి సీఎంకు నివేదించినట్లు అధికారవర్గాల సమాచారం. దీనిపై ఆమోదం వస్తే.. త్వరలోనే ఆర్టీసీ బస్ టికెట్ ధరలు మరింత పెరుగనున్నాయి.