తెలంగాణలో కొనసాగుతున్న సబ్ ఇన్స్పెక్టర్(ఎస్ఐ), కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నియామక ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. కేవలం మెయిన్స్ పరీక్షలు మాత్రమే మిగిలి ఉన్నాయి. డిసెంబర్ 6తో ఫిజికల్ ఈవెంట్స్ కూడా ముగిసిపోయాయి. ప్రిలిమినరీ ఎగ్జామ్‌లో క్వాలిఫై అయిన 2,07,106 మంది అభ్యర్థులకు ఈవెంట్స్ నిర్వహించగా వారిలో 1,11,209 మంది మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించారు. అయితే అభ్యర్థులకు నిర్వహించిన శరీర ధారుడ్య పరీక్షల్లో కొన్ని అంశాలు వివాదస్పద మయ్యాయి. అందులో ప్రధానంగా లాంగ్ జంప్‌పై అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. 4 మీటర్ల లాంగ్ జంప్ పెట్టడంపై విమర్శలు రావడంతో పాటు చాలా మంది లాంగ్ జంప్‌లో క్వాలిఫై కావడం లేదంటూ ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
అట్టి ఆరోపణలను TSLPRB కొట్టిపారేసింది. తాజాగా ఓ కీలక ప్రకటనను చేసింది. ప్రతి 100 మంది అభ్యర్థుల్లో 83 మంది లాంగ్ జంప్‌లో క్వాలిఫై అయ్యారని తెలిపింది. కేవలం 17 శాతం డిస్ క్వాలిఫై అయిన అభ్యర్థులే అవసరం లేని రాజకీయం చేస్తున్నారని పేర్కొంది. లాంగ్ జంప్‌ను పారదర్శకంగా నిర్వహించామని తెలిపిన TSLPRB..తొలిసారి ప్రతి అభ్యర్థికి డిజిటల్ రిస్ట్ బ్యాండ్ అందించామని స్పష్టం చేసింది.
ఇక మార్చి 12 నుంచి ఎస్ఐ, కానిస్టేబుల్ మెయిన్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 9న సివిల్ ఎస్ఐ నియామక పరీక్షలు జరుగనున్నాయి. ఏప్రిల్ 23న అన్ని రకాల కానిస్టేబుల్ పోస్టులకు మెయిన్స్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష ఉంటుంది. హాల్‌టికెట్లను ఎప్పటినుంచి డౌన్లోడ్ చేసుకోచ్చనే విషయాన్ని త్వరలో ప్రకటిస్తామని బోర్డు వెల్లడించింది.