టీఎస్‌పీఎఫ్ కానిస్టేబుల్‌ను కాటేసిన డెంగీ..   - MicTv.in - Telugu News
mictv telugu

టీఎస్‌పీఎఫ్ కానిస్టేబుల్‌ను కాటేసిన డెంగీ..  

September 24, 2019

constable ....

వారంతే విధి నిర్వహణలో చాలా పట్టుదలగా వుంటారు. ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రభుత్వ భవనాలకు తమ రక్ష వుంటుందని హామీ ఇస్తున్నారు. మరి వారి ప్రాణాలకు గ్యారెంటీ ఎవరు ఇస్తారు అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది? దోమలు వీరవిహారం చేస్తూ.. డెంగీని వ్యాప్తి చేసి అన్యాయంగా ప్రాణాలు బలిగొంటున్నాయి. ఈ క్రమంలో ఓ TSPF(తెలంగాణ స్టేట్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్) పోలీస్ కానిస్టేబుల్ డెంగీతో మృతిచెందారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. మరో 30 మంది కానిస్టేబుళ్లు డెంగీ బారినపడి హైదరాబాద్‌లోని పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

పగలు అనక రాత్రి అనక ప్రభుత్వ భవనాలు అయిన సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ తదితర భవనాలకు టీఎస్‌పీఎఫ్ పోలీసులు భద్రత కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారు రాత్రనకా, పగలనకా డ్యూటీ చేయాల్సి వుంటుంది. వారికి డ్యూటీ టైమింగ్స్ పెరుగుతూనే వుంటాయి తప్పితే తగ్గవు. దీంతో వారు రక్షణ కల్పిస్తున్న చోట వారికి రక్షణ లేకుండా పోయింది. భవనాల లోపల ఏసీలు, ఫ్యాన్లు వంటి వసతులు వుంటాయి. కానీ, బయట అవన్నీ వుండవు. సరైన వసతులు లేని కారణంతో దోమలు విజృంభించాయి. దీంతో 30 మంది టీఎస్‌పీఎఫ్ కానిస్టేబుళ్లు డెంగీ మహమ్మారి బారినపడ్డారు. కేర్, యశోద, అపోలో తదితర ఆస్పత్రుల్లో వారు చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో చికిత్స పొందుతున్న ఖమ్మం జిల్లాకు చెందిన బోడ రమేశ్ నాయక్(32) మృతి చెందారు. దీంతో ఆయన కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది.రమేశ్‌కు ఇద్దరు కుమార్తెలు వున్నారు. మిగతా కానిస్టేబుళ్లలో కొంతమంది పరిస్థితి విషమంగా వుందని చెబుతున్నారు. తమకున్న సమస్య గురించి ఉన్నతాధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు.