నోటిఫికేషన్, పరీక్షలపై TSPSC చైర్మన్ క్లారిటీ - MicTv.in - Telugu News
mictv telugu

నోటిఫికేషన్, పరీక్షలపై TSPSC చైర్మన్ క్లారిటీ

March 12, 2022

uuuu

తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 91,142 వేల పోస్టులను భర్తీ చేస్తున్నామని కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలోని 33 జిల్లాల నిరుద్యోగులు ఉద్యోగాల నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడు వస్తుంది? దరఖాస్తు ఎప్పుడెప్పుడు చేయాలి? రాత్రిపగలు కష్టపడి ఈసారి ఎలాగైనా ఉద్యోగం సాధించాలని కలలు కంటున్నారు. ఈ తరుణంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) చైర్మన్ బి. జనార్దన్ రెడ్డి నిరుద్యోగులకు పలు విషయాలను వెల్లడించారు.

ఆయన మాట్లాడుతూ.. ‘న్యాయవివాదాలు తలెత్తకుండా.. నిర్ణీత గడువులోగా ఉద్యోగ నియామక ప్రక్రియ పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం. త్వరలోనే వెలువడే ప్రభుత్వ ఉత్తర్వులతో పోస్టులు, భర్తీ ప్రక్రియపై మరింత స్పష్టత వస్తుంది. పరీక్షలకు ప్రణాళికాబద్ధంగా సిద్ధం కావాలని, అనవసర ఆందోళనలతో పరీక్షల సమయంలో ఇబ్బందులకు గురికావొద్దని అభ్యర్థులను వేడుకుంటున్నా. నోటిఫికేషన్ల జారీ నుంచి రాతపరీక్షకు మధ్య సన్నద్ధతకు తగిన సమయం ఉంటుంది. జవాబు పత్రంలో బబ్లింగ్‌లో పొరపాట్లు దొర్లకుండా చూసుకోవాలి. నియామకాలపై అభ్యర్ధుల సందేహాలు, ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థను నెలకొల్పి, ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తాం’ అని ఆయన తెలిపారు.

అంతేకాకుండా జిల్లా స్థాయిలో ఏజెన్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల తనిఖీ ప్రక్రియ వేగంగా పూర్తయ్యేలా ప్రతివారం సమీక్ష నిర్వహించి, త్వరగా పోస్టింగులు ఇస్తామన్నారు. పరీక్షల్లో అభ్యర్థి ప్రతిభ మేరకు ఎంపికలు ఉంటాయని.. ఉద్యోగాలిప్పిస్తామంటూ ఎవరైనా ప్రలోభాలకు గురిచేస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు.

1. గ్రూప్-1 పరీక్ష ఎలా ఉంటుంది.?

గ్రూప్-1 సిలబస్ ను 2015లో కమిషన్ ఖరారు చేసింది. ప్రస్తుతం అందులో మార్పులు ఉండవు. నోటిఫికేషన్ సమయంలోనే దరఖాస్తు చివరి తేదీతో పాటు ప్రిలిమినరీ, ప్రధాన పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించే సమయాన్ని సివిల్స్ తరహాలో ముందుగానే ప్రకటిస్తాం. ప్రధాన పరీక్షలకు ఈ-ప్రశ్నపత్రాన్ని అందిస్తాం. పరీక్ష కేంద్రంలో కంప్యూటర్ ముందు కూర్చుని ప్రత్యేక పాస్వర్డ్‌తో ప్రశ్నపత్రాన్ని ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. పరీక్ష సమయానికి ముందు, పరీక్ష ముగిసిన తర్వాత.. ఆ ప్రశ్నపత్రం కనిపించదు.

2. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు?

రోస్టర్ తయారీ, రిజర్వేషన్ల ఖరారు, విద్యార్హతలు నిర్ణయించడంలో సంబంధిత విభాగాల పొరపాట్లతో న్యాయవివాదాలు తలెత్తాయి. భవిష్యత్తులో ఈ తరహా వివాదాల్లేకుండా జాగ్రత్త పడతాం. ఈ మేరకు కమిషన్ తరపున ప్రభుత్వ విభాగాలకు లేఖలు రాశాం. ఒకవేళ ఏమైనా పొరపాట్లు దొర్లితే వెంటనే సరిచేసుకుంటాం. ఎవరైనా కావాలని న్యాయవివాదాలు సృష్టించే ప్రయత్నం చేస్తే.. కోర్టులలో అఫిడవిట్లు దాఖలు చేసి ఉద్యోగాల భర్తీలో జాప్యం లేకుండా చర్యలు తీసుకుంటాం.

3. ఇంకెన్ని రోజులలో నోటిఫికెషన్ వస్తుంది..?

రిజర్వేషన్లు, విద్యార్హతలు, స్పోర్ట్స్, దివ్యాంగుల కోటా వివరాలతో నోటిఫికేషన్ ప్రతిపాదనలు సిద్ధం చేయాలి. దీనికి 7-30 రోజుల సమయం పడుతుంది. ఈ ప్రతిపాదనలు నియామక సంస్థలకు అందిన వెంటనే కమిషన్ అధికారులు, విభాగాధిపతులు రిజర్వేషన్లు, విద్యార్హతలు, వయోపరిమితి తదితర వివరాలను సరిచూస్తారు. ఈ ప్రక్రియ పూర్తికి వారం పడుతుంది. ఆ తర్వాత ఉద్యోగ ప్రకటన జారీచేసి దరఖాస్తుల స్వీకరణకు 30-45 రోజుల సమయం ఉంటుంది. దరఖాస్తు గడువు ముగిశాక రాత పరీక్షకు 2-3 నెలల సమయం అవసరం. ఓఎంఆర్ జవాబు పత్రాల పరిశీలన, మూల్యాంకనానికి మరో నెల రోజులు కావాలి. అనంతరం సర్టిఫికెట్ల పరిశీలన, తుది ఫలితాలకు 1-2 నెలలు పడుతుంది. నోటిఫికేషన్లు.. పరీక్షలకు మధ్య అభ్యర్థులు సన్నద్ధమయ్యేంత సమయం ఉంటుంది అని ఆయన చెప్పారు.