పేపర్ లీకేజీ వ్యవహారం తెలంగాణను కుదిపేస్తోంది. వేలాది మంది నిరుద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ వ్యవహారంపై టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్ రెడ్డి మాట్లాడారు. గ్రూప్ 1 పరీక్ష రదవుతుంది అనే వార్తలపై క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడే గ్రూప్ వన్ గురించి మాట్లాడటం కరెక్ట్ కాదని చెప్పారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష యధావిధిగా ఉంటుందని స్పష్టం చేశారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో ప్రవీణ్ కి 103 రావడం నిజమే.. కానీ అదే టాప్ మార్క్ కాదని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మొద్దని సూచించారు.తన పిల్లలు ఎవరూ ఎవరూ గ్రూప్-1 పరీక్ష రాయలేదన్నారు. మా బంధువులు రాస్తానంటే వద్దని చెప్పినట్లు జనార్దన్ రెడ్డి వివరించారు.
టౌన్ ప్లానింగ్ పరీక్షకు ముందు రోజు పేపర్ లీకేజీపై తమకు కొంత సమాచారం వచ్చిందని.. దాంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్ రెడ్డి తెలిపారు. కీలక నిందితుడు రూ.10 లక్షల పేపర్లు అమ్మాడని గుర్తించామన్నారు. టీఎస్‌పీఎస్సీలొ దాదాపుగా 2 వేలమంది ఉద్యోగులు ఉన్నారని వెల్లడించారు. ప్రతి ఏడాది 4 వేలకు పైగా నియామకాలు చేపడుతున్నామన్నారు. ఈ ఏడాది దాదాపుగా 23 వేలకు పైగా నియామకాలు చేపట్టామని.. 26 నోటిఫికేషన్లు విడుదల చేసినట్లు వివరించారు.
రాజశేఖర్ రెడ్డి నెట్వర్క్ ఎక్స్ పర్ట్ అని, 6,7 ఏళ్లుగా ఇక్కడ పనిచేస్తున్నట్లు తెలిపారు. అతనికి అన్ని ఐపీ అడ్రస్‌లు తెలియడంతో..అతని ద్వారానే హ్యాక్ అయ్యిందని పేర్కొన్నారు.
పరీక్ష పత్రాన్ని అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ద్వారా లీక్ చేయించినట్లుగా వెల్లడించారు. వీరు లీక్ చేసి కొందరు వ్యక్తులకు సమాచారాన్ని చేరవేశారన్నారు. AE పరీక్ష రద్దుపై బుధవారం నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇంటి దొంగలు కాబట్టి తెలుసుకోవడంలో ఇబ్బంది అయ్యిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవాళ్లు ఇలాంటి అక్రమాలకు పాల్గొనడం దురదృష్టమని టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్ రెడ్డి తెలిపారు.