ప్రశ్నపత్రాల లీకేజీలపై లక్షలాది మంది అభ్యర్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ పబ్లిక సర్వీస్ కమిషన్ (TSPSC) కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ) పరీక్షను రద్దు చేసిన కమిషన్ తాజాగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షతోపాటు డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్స్ (డీఏఓ), ఏఈఈ పరీక్షను కూడా రద్దు చేసింది. ఈ ఏడాది జూన్ 11న గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహిస్తామని తెలిపింది. ఈ పరీక్ష గత ఏడాది అక్టోబర్ 16 జరిగింది. ఏఈఈ పరీక్ష జనవరి 21, డీఏవో పరీక్ష ఫిబ్రవరి 26న పరీక్ష నిర్వహించారు. ఈ పేపర్లను కమిషన్ ఉద్యోగి పి. ప్రవీణ్ తోపాటు మరికొందరు లీక్ చేసినట్లు దర్యాప్తులో తేలడంతో రద్దు చేశారు.ఏఈ పరీక్షను ఏప్రిల్ 4న మళ్లీ నిర్వహిస్తారు.
కాగా జూనియర్ లెక్చరర్ల పరీక్ష వాయిదా పడినట్లు వార్తలు రాగా, అలాంటిదేమీ లేదని కమిషన్ తెలిపింది. పేపర్ల లీకేజీపై ఎప్పటికప్పుడు కొత్త విషయాలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో అభ్యర్థులు కమిషన్ అధికారికంగా చెప్పే విషయాలనే విశ్వసించాలని, పుకార్లను నమ్మొద్దని కమిషన్ వర్గాలు కోరాయి. దర్యాప్తులో కొత్త కొత్త విషయాలు వెలుగు చూసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే జరిగిన పరీక్షల్లో మరికొన్ని రద్దుకావడం, జరగబోయే పరీక్షల్లో కొన్ని వాయిదాపడే అవకాశం ఉంది.
వచ్చే మూడు నాలుగు నెలల్లో కమిషన్ 20కి పైగా పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ప్రవీణ్ లీకుల కాండ నేపథ్యంలో మరిన్ని అక్రమాలు జరక్కకుండా ఇప్పటికే తయారు చేసిన పేపర్ల స్థానంలో కొత్త పేపర్లతో పరీక్ష నిర్వహించడానికి కమిషన్ కసరత్తు చేస్తోంది. అక్టోబర్ 16 న గ్రూప్ -1 ప్రిలిమ్స్‌కు రెండున్నర లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. జనవరి 22 న అసిస్టెంట్ ఎగ్జక్యూటివ్ ఇంజినీరింగ్ ఎగ్జామ్‌ను 60 వేలమంది అభ్యర్థులు రాశారు. డీఏఓ పరీక్షకు కూడా 60 వేలకు పైగా అభ్యర్థులు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 503 గ్రూప్ -1 పోస్టుల భర్తీకి విడుదల చేసిన తొలి నోటిఫికేషన్ ఇదే.
రద్దయిన పరీక్షలు
గ్రూప్ 1.. గత ఏడాది అక్టోబర్ 16న జరిగిన పరీక్ష
ఏఈఈ… ఈ ఏడాది జనవరి 22న జరిగిన పరీక్ష
డీఏవో ఈ ఏడాది ఫిబ్రవరి 26న జరిగిన పరీక్ష్
ఏఈ.. ఈ నెల 5న జరిగిన పరీక్ష
వాయిదాపడిన పరీక్షలు
మార్చి 12న జరగాల్సిన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్, 15, 16న జరగాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్ష