TSPSC Group 2 Exam Date 2023 announced
mictv telugu

గ్రూప్‌-2 అభ్యర్థులకు అలెర్ట్‌.. పరీక్షల తేదీలివే..

March 1, 2023

TSPSC Group 2 Exam Date 2023 announced

తెలంగాణలో గ్రూప్-2 పరీక్షల తేదీలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ఖారారు చేసింది.ఆగస్టు 29, 30న పరీక్ష జరుగుతుందని టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్‌ తెలిపారు. 29న పేపర్‌1 (జనరల్‌ ఎబిలిటీస్‌, స్టడీస్‌), పేపర్‌2 (చరిత్ర, రాజకీయం, సమాజం), 30న పేపర్‌3 (ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి), పేపర్‌4 (తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం) పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఒక్కో పరీక్షకు మూడు గంటల సమయం ఉంటుందని తెలిపారు. ఒక్కో పేపర్‌కు 150 మార్కుల చొప్పున మొత్తం 600 మార్కులకు గ్రూప్‌2 పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. పరీక్షకు వారం రోజుల ముందు నుంచే విద్యార్థులు తమ హాల్‌టికెట్లను https://tspsc.gov.in వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు.

గ్రూప్-2 ఉద్యోగాలకు సంబంధించి 783 పోస్టుల కోసం గతేడాది డిసెంబర్‌ 29న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయగా.. జనవరి 18 నుంచి దరఖాస్తులు స్వీకరించింది. గ్రూప్‌-2 ఉద్యోగాల కోసం 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. చివరి మూడు రోజుల్లోనే 1.10 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో పోస్టుకు 705 మంది పోటీ పడుతున్నారు. ఇతర పోటీ పరీక్షల తేదీలను దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే పరీక్షా తేదీని నిర్ణయించినట్టు అధికారులు వెల్లడించారు.