గ్రూప్ 4 నోటిఫికేషన్, దరఖాస్తుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు టీఎస్పీఎస్సీ షాకింగ్ న్యూస్ చెప్పింది. గ్రూప్ 4 దరఖాస్తుల ప్రక్రియను మరో వారం రోజులు వాయిదా వేస్తూ వెబ్ నోటీస్ ను జారీ చేసింది. ముందుగా ప్రకటించిన విధంగా.. నేటి (శుక్రవారం) నుంచి గ్రూప్-4 ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. డిసెంబర్ 23 నుంచి జనవరి 12, 2023 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు రాష్ట్ర ప్రబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇప్పటికే ప్రకటించింది. కానీ తాజాగా వెల్లడించిన వెబ్ నోట్ లో ఆ తేదీల్లో భారీ మార్పులు చేశారు. టెక్నికల్ సమస్య కారణంగా గ్రూప్ 4 దరఖాస్తుల ప్రక్రియను డిసెంబర్ 30వ తేదీగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అంతే కాకుండా.. దరఖాస్తుల స్వీకరణను చివరి తేదీగా జనవరి 19, 2023 సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలని అభ్యర్థులకు సూచించారు.
ఇదిలా ఉండగా.. పూర్తి నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు కూడా ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉంది. నోటిఫికేషన్ లో జిల్లాల వారీగా పోస్టుల వివరాలు తెలుసుకునేందుకు కూడా నేడు అవకాశం లేకుండా పోయింది. దరఖాస్తుల ప్రక్రియ డిసెంబర్ 30 నుంచి ఉండటంతో.. ఈలోపు పూర్తి నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు.ఇక దరఖాస్తుల ప్రక్రియ వాయిదా పడటానికి కారణం అన్ని డిపార్ట్ మెంట్ల నుంచి పూర్తి స్థాయి సమాచారం రాకపోవడంతో టీఎస్పీఎస్సీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో మొత్తం 97 హెచ్ ఓడీల పరిధిలో 9,168 పోస్టుల భర్తీని టీఎస్పీఎస్సీకి అప్పగిస్తూ నవంబర్ 25న ఆర్థిక శాఖ ఆమోదించిన విషయం తెలిసిందే. అయితే వీటిని వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వం ఒత్తిడి చేయగా.. టీఎస్పీఎస్సీ డిసెంబర్ 01, 2022న షార్ట్ నోటిఫికేషన్ వెల్లడించినట్లు తెలుస్తోంది. అయితే పలు డిపార్ట్ మెంట్ల నుంచి ఇండెంట్ల(ప్రతిపాదనలు)పై క్లారిటీ లేకపోవడంతో TSPSC అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 30 నుంచి దరఖాస్తులు ప్రారంభంతో.. గ్రూప్ 4 పరీక్షను మే లేదా జూన్ లో నిర్వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.