TSPSC లీకేజ్ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారింది. ప్రతిపక్షాలు, విద్యార్ధి సంఘాలు పేపర్ లీకేజీపై పెద్ద ఎత్తున ఆందోళనలను చేపడుతున్నాయి. ప్రగతి భవన్, ఆర్టీసీ భవన్, TSPSC కార్యాలయాలను ముట్టడి చేస్తూ నిరసనను తెలుపుతున్నాయి. ఈ లీకేజీ వ్యవహారంపై శుక్రవారం నాడు ఆందోళన చేపట్టాలని పార్టీ శ్రేణులకు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో TSPSC ముట్టడికి బయల్దేరిన షర్మిలను పోలీసులు ముందస్తుగా అడ్డుకుని ఆమెను గృహ నిర్బంధం చేశారు. దీంతో ప్రస్తుతం లోటస్ పాండ్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. లోటస్ పాండ్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. TSPSC అధికారులకు వివరణ ఇవ్వడానికి ఎందుకు వెళ్లనివ్వడం లేదని షర్మిల పోలీసులపై ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో మీరు ఏమి చేయాలనుకున్నా ఇంటి దగ్గరి నుంచే చేయాలని పోలీసులు సూచించారు. గృహ నిర్బంధం నేపథ్యంలో షర్మిల ఇంటి దగ్గర తోపులాట జరిగింది. ఏదిఏమైనప్పటికీ TSPSC బాధితులకు పార్టీ అండగా ఉంటుందని, ప్రభుత్వం న్యాయం చేసే వరకు పోరాడుతుందని షర్మిల తెలిపారు. మరో వైపు TSPSC కార్యాలయం చేరుకున్న ప్రవీణ్‌ను పోలీసులు కార్యాలయం వద్దే అడ్డుకుని ఆయన్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాగా ఇద్దరు నేతలు జరిగిన స్కాముపై విచారణ జరిపించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.