తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ)లో ప్రశ్నపత్రాల లీకేజీపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు! ఈ మొత్తం వ్యవహారంపై కమిషన్ అధికారులు ఇస్తున్న వివరణలు సంతృప్తికరంగా లేకపోవడం, అసలు ఎన్ని పేపర్లు లీకయ్యాయన్నదానిపై స్పష్టత కొరవడ్డం, లక్షలాది మంది అభ్యర్థుల ఆందోళన నేపథ్యంలో ఆయన కమిషన్ చైర్మన్ జనార్ధన్ రెడ్డిని ప్రగతి భవన్‌కు పిలిపించుకుని మాట్లాడుతున్నారు. ఈ ఉదయం సీఎం నివాసానికి చేరుకున్న జనార్ధన్ రెడ్డి లీకేజీలపై సీఎంకు వివరిస్తున్నారు. మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పలువురు ఉన్నతాధికారులుభేటీలో భేటీలో పాల్గొన్నారు. కమిషన్‌పై అభ్యర్థుల్లో, ప్రజల్లో విశ్వాసం నెలకొల్పడానికి ఏం చేయాలన్నదానిపై మంతనాలు సాగుతున్నాయి. ప్రస్తుతం కమిషన్ బోర్డును రద్దు చేయాలనే ఆలోచన కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
రద్దే పరిష్కారం..
ప్రశ్నపత్రాల లీకేజీకి బాధ్యులెవరన్నదానిపై స్పష్టత రావడం లేదు. కంప్యూటర్లను హ్యాక్ చేశారని తొలుత భావించినా, తర్వాత కీలక నిందితులు ప్రవీణ్, రాజశేఖర్‌లు ఉన్నతాధిరులు డైరీల్లో రాసుకున్న పాస్ వర్డులు కొట్టేసి లీక్ చేశారని చెప్పారు. అయితే డైరీల్లో పాస్ వర్డులు రాసుకోలేదని తేలడంతో హ్యాక్ జరిగిందా, లేకపోతే మరో మార్గంలో లీక్ చేశారా అన్నదానిపై దర్యాప్తు అధికారులు దృష్టిసారించారు. లీకేజీల నేపథ్యంలో గ్రూప్-1, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ), డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏవో) పరీక్షలను కమిషన్ రద్దు చేయడం, పలు పరీక్షలను వాయిదా వేయడం తెలిసిందే. ఎనిమిదేళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు రాకరాక వచ్చిన నోటిఫికేషన్ల చూసి నమ్మకంతో పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పటికే చాలా పోస్టుల భర్తీ ప్రక్రియ నడుస్తోంది.
పేపర్ లీకేజీల వల్ల గతంలో జరిగిన నియామకాలపైనా అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇది ఎన్నికల ఏడాది కనుక కమిషన్ కారణంగా ప్రభుత్వంపై అపోహలు నెలకొనే పరిస్థితి ఏర్పడింది. మళ్లీ పరీక్షలు నిర్వహించడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే కాక, విశ్వసనీయతకు కూడా పరీక్షే. కమిషన్ నిర్వహణలో ఎన్నో లోటుపాట్లు ఉన్నట్లు తేలింది. సిబ్బంది కొరత వల్ల పెద్దసంఖ్యలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. వారిలో కొందరు కీలక విభాగాల్లో పనిచేస్తున్నారు. కమిషన్‌కు ప్రాణసమానంగా భావించే పరీక్షల యంత్రాంగంలోనే ఐదారు పేపర్లు లీక్ కావడం పరిస్థితికి అద్దం పడుతోంది. చైర్మన్ జనార్ధన్ రెడ్డి నిర్వహణ లోపాలపై దృష్టి పెట్టడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. లీకేజీల నేపథ్యంలో ఆయనను పదవి నుంచి తప్పించాలని అటు అభ్యర్థులు, ఇటు విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఈ అంశాలన్నింటిన పరిశీలించిన ప్రభుత్వం కమిషన్ బోర్డులను రద్దు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై చర్చించడానికే జనార్ధన్ రెడ్డిని కేసీఆర్ పిలిపించుకున్నారని, భేటీ తర్వాత రద్దు నిర్ణయం ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి. అయితో బోర్డును ఇప్పటికిప్పుడు రద్దు చేస్తే వైఫల్యాన్ని అంగీకరించినట్లు అవుతుందని, విపక్షాలు ఆ కోణంలోనూ దాడి చేస్తాయనే వాదనలు వినిపిస్తున్నాయి. రద్దు చేయడం లేకపోతే మధ్యేమార్గంగా అధికారులను మార్చడం వంటి చర్యలకు పూనుకునే అవకాశం ఉంది.