లక్షలాదిమంది అభ్యర్థులపై ఆశలపై నీళ్లు చల్లి, సవాలక్ష అనుమానాలు రేకెత్తించిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) కేసులో సీట్ దర్యాప్తును వేగవంతం చేస్తోంది. పోలీసులు కూడా పక్కా ఆధారాల కోసం నిందితులను కూపీ లాగుతున్నారు. పశ్నపత్రాలు ఎలా లీకయ్యాయో అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రధాన నిందితులైన కమిషన్ ఉద్యోగులు ప్రవీణ్, రాజశేఖర్‌లను శనివారం కమిషన్ కార్యాయానికి తీసుకెళ్లి సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేయించింది. వీరిని ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి కార్యాలయానికి తరలించారు.
రాజశేఖర్ ప్రశ్నపత్రాలున్న కాన్ఫిడెన్షియల్ గదిలోని కంప్యూటర్ల పాస్ వర్డులను ఎలా తెలుసుకుని, పెన్ డ్రైవ్‌లోకి ఎలా వేసుకున్నాడో, ప్రవీణ్‌కు ఎలా అందించాడో మొత్తం చేసి చూపించమన్నారు. సెక్షన్ ఆఫీసర్ శంకర్ లక్ష్మి కంప్యూటర్ నుంచి ఇంకా ఏం దొంగిలించారో చెప్పాలని, ఐపీ అడ్రస్, సిస్టమ్ యాక్టివిటీ వంటి అన్ని వివరాలను తెలుసుకుంటున్నారు. నిందితులు కంప్యూటర్ల ఐపీ అడ్రసులు మార్చినట్లు తేలడంలో అసలు టెక్నాలజీలో వారు ఎలా నైపుణ్యం సంపాదించారు, యూబ్యూబ్ ద్వారా తెలుకున్నారా, లేకపోతే ఇతర ఉద్యోగులు సహకరించారా అనే అంశాలపై విచారణ జరుపుతున్నారు. రాజశేఖర్, ప్రవీణ్ కలిసే లీకేజీకి తెరతీశారని, పేపర్లు సెల్ ఫోన్ ప్రవీణ్ తన సన్నిహతురాలైన హిందీ టీచర్ రేణుకకు పంపాడని పోలీసులు చెప్పడం తెలిసిందే.