TSPSC పేపర్ లీకేజీ వ్యవహారం తెలంగాణను కుదిపేస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఆందోళనలు ఉధృతం చేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ, కాంగ్రెస్ శ్రేణులు నిరసనలకు దిగాయి. లీకేజీ వ్యవహారంపై త్వరగా విచారణ చేపట్టాలని ఆందోళనకు దిగారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
మరోవైపు హైదరాబాద్ ఘన్‌పార్క్ వద్ద బీజేపీ చేపట్టిన నిరసన దీక్ష ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీసింది. తొలుత బండి సంజయ్ పార్టీ కార్యాలయం నుంచి గన్‌పార్కుకు పాదయాత్ర చేపట్టారు. సంజయ్‌తోపాటు పార్టీ శ్రేణులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఆయనకు మద్దతు తెలుపుతూ దీక్షలో పాల్గొన్నారు. బండి సంజయ్ దీక్ష తర్వాత TSPSC ఆఫీస్‌కు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తీవ్ర గందరగోళం నెలకొంది. బీజేపీ శ్రేణులకు, పోలీసులుకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి అదుపుతప్పడంతో బండి సంజయ్, ఈటల రాజేందర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి వాహనంలో తరలించారు.
అరెస్ట్‌కు ముందు మీడియతో మాట్లాడిన బండి సంజయ్ సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పేపర్ లీక్‌పై సీఎం స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రశ్నా పత్రాలు లీక్ చేసి లక్షల మంది విద్యార్థుల ఉసురు పోసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ సర్పంచ్ బిడ్డ కోసం పేపర్ లీకేజీ చేస్తారా అని ప్రశ్నించారు. టీఎస్పీఎస్సీ లీకేజీకి కారణం ఐటీ వైఫల్యమేనని, దీనికి బాధ్యతగా కేటీఆర్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి డిమాండ్ చేశారు.స్కాంపై సిట్టింగ్ జడ్జిలతో విచారణ జరిపించాలన్నారు.