తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) పలు నోటిఫికేషన్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులను స్వీకరిస్తోంది. వాటిలో కొన్ని ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. గత నెల డిసెంబర్ 7, 2022 న పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది టీఎస్పీఎస్సీ.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న మొత్తం 247 లెక్చరర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారంగా.. డిసెంబర్ 14, 2022 నుంచి దరఖాస్తుల ప్రక్రియను మొదలెట్టింది. మొత్తం 19 సబ్జెక్టుల్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.ఇప్పటికే చాలామంది నిరుద్యోగులు ఈ పోస్టులకు దరఖాస్తు చేశారు. జనవరి 4వ తేదీ అంటే ఈరోజే ఈ పోస్టులకు అప్లై చేయడానికి చివరి అవకాశం. అర్హత గల అభ్యర్థులు ఇంకా ఎవరైనా ఈ ఉద్యోగాలకు అప్లై చేయనట్లయితే.. తదితర వివరాల కోసం www.tspsc.gov.in వెబ్సైట్ను లాగిన్ అవొచ్చు.