TSPSC question papers leakage Honey trap and money trap Renuka Praveen story
mictv telugu

అతనికి హనీ + ఆమెకు మనీ = TSPSC రేణుకా ప్రవీణం

March 15, 2023

TSPSC question papers leakage Honey trap and money trap Renuka Praveen story
ఒక దొంగది, ఒక దొంగది కలసి అత్యున్నత రాష్ట్ర ప్రభుత్వ సంస్థ పరువును నడి బజారుకు ఈడ్చారు. వేలమంది అభ్యర్థుల ఆశలపై నిప్పులు పోశారు. కష్టపడి చదివిన చదువునంతా బూడిద చేశారు. ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ విన్నా వాళ్లిద్దరి పేర్లే.

రేణుక, ప్రవీణ్! తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC)లో పనిచేస్తున్న అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పి.ప్రవీణ్‌, సర్కారీ హిందీ టీచరమ్మ రేణుక ‘చేతిలో చెయ్యేసి’ నడిపిన వసూళ్ల బాగోతం మొత్తం బయటికి రావడంతో పోలీసులే కంగుతున్నారు. ప్రవీణ్‌తో ఉన్న అత్యంత సాన్నిహిత్యమే పెట్టుబడిగా రేణుక దందా, ఆమె అందం కోసం చెయ్యారని నేరం చేసిన ప్రవీణ్ నడిపిన రాకెట్‌లాంటిది బహుశా తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు ఎక్కడా జరగలేదంటున్నారు.

ఎక్కడ మొదలైంది..

ప్రవీణ్‌, రేణుకల అక్రమ పురాణం ఈనాటిది కాదు. 2018లోనే వీరి మధ్య బంధం మొదలైంది. ఆడవాళ్లంటే ప్రవీణ్‌కు ఉన్న పిచ్చి, తన పని చేసుకోవడానికి దేనికైనా తెగించే రేణుకల మధ్య అనుబంధం ఏర్పడ్డంలో పెద్ద వింతేమీ లేదు. ప్రవీణ్ తండ్రి హరీంద్రరావు TSPSCలో ఉద్యోగం చేస్తూ సర్వీసులో ఉండగానే చనిపోయాడు. ప్రవీణ్‌కు కారుణ్య నియామకం కింద సంస్థలో 2018లో ఉద్యోగం దక్కింది. అతనికి తొలి నుంచి ఆడవాళ్ల వ్యవనం ఉంది. అదే ఏడాది రేణుకతో పరిచయమైంది.

మహబూబ్ నగర్ జిల్లా పగిడ్యాల్ పంచగల్ తండాకు చెందిన రాథోడ్ రేణుక అప్పట్లో డిఎస్సీ హిందీ పండిట్ ఉద్యోగానికి పరీక్ష రాసింది. ఏవో సాంకేతిక సమస్యలు రావడంతో పరిష్కరించుకోడానికి కమిషన్‌కు వెళ్లగా ప్రవీణ్ పరిచయమయ్యాడు. ఆ సమస్య తీరిపోవడంతో రేణుకకు హిందీ పండిట్ ఉద్యోగం వచ్చింది. అప్పట్నుంచీ ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పడింది. ఎక్కడికైనా కలిసి వెళ్లడం, ఫోటోలు, వీడియోలు తీసుకోవడం వంటివి చేశారు. రేణుక ప్రస్తుతం వనపర్తి ఎస్సీ గురుకుల పాఠశాలలో ఉద్యోగం చేస్తోంది.

అన్నీ కోసం అన్నిటికీ తెగించి..

రేణుకకు పెళ్లయినా ప్రవీణ్‌కు టచ్‌లో ఉంటూనే వస్తోంది. దాదాపు ఏడాది కింద వీరి సావాసం కొత్త మలుపు తిరిగింది. రేణుక సోదరుడు రాజేశ్ నాయక్ వ్యాపారాలు చేసి పీకల్లోతు అప్పుల్లో మునిగిపోయాడు. తల్లి లక్ష్మాబాయి కూడా ఆర్థిక కష్టాల్లో ఉంది. వారిని కష్టాల నుంచి గట్టెక్కించడానికి రేణుక ప్రవీణ్‌ సాయం కోరింది. ఇద్దరూ స్కెచ్ వేశారు. ‘ప్రశ్నపత్రాలు నాకు అందిస్తే నీకేది కావాలన్నా ఇస్తా,’’ అని రేణుక ఆఫర్ ఇచ్చింది. ఆమె అంటే పడిచచ్చే ప్రవీణ్ సరే అన్నాడు.

రేణుక డీఆర్డీఏలో టెక్నికల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న భర్త ఢాక్యా నాయక్‌ను కూడా రంగంలోకి దించింది. ప్రవీణ్ కమిషన్‌లోని ఓ కార్యదర్శికి పీఏగా పనిచేస్తుండంతో ప్రశ్నపత్రాలను సులువుగానే లీక్ చేశారు. ప్రవీణ్‌కు ఆడవాళ్లతో చాటుమాటు వ్యవహారాలు నడపడమంటే తెగపిచ్చి. అతని ఫోన్లో లెక్కనేన్ని న్యూడ్ వీడియోలు, న్యూడ్ చాంటింగ్ వివరాలు వెలుగు చూశాయి. మహిళా అభ్యర్థులు సమస్యల పరిష్కారం కోసం కమిషన్‌కు వస్తే వారిని ట్రాప్ చేసి ముగ్గులోకి దించేవాడని దర్యాప్తులో బయటపడుతోంది. ఈ బలహీనతను బాగా కనిపిట్టిన రేణుక హనీ ట్రాప్‌ ప్లస్ డబ్బుతో అతణ్ని బుట్టులో వేసుకుని దందా చేసింది.

లీక్ ఇలా..

ఈ నెల 12న జరగాల్సిన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్, 15, 16న జరగాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షల పశ్నపత్రాలను ప్రవీణ్ లీక్ చేశాడు. ఈ నెల 5న జరిగిన అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్ష పేపర్‌నూ కొట్టేశాడు. ఉన్నతాధికారుల డైరీల నుంచి, కంప్యూటర్ల నుంచి దొంగచాటుగా పాస్ వర్డులను తస్కరించాడు. దీని కోసం కమిషన్‌లోనే పనిచేస్తున్న రాజశేఖర్ అనే ఉద్యోగి సాయం తీసుకున్నాడు. కంప్యూటర్లలోని పేపర్లను రహస్యంగా పెన్ డ్రైవ్‌లో వేసుకుని రేణుకకు ఫార్వర్డ్ చేశాడు.

పేపర్లను అమ్ముకుని డబ్బు సంపాదించాలని ప్లాన్ వేసిన రేణుక తన బంధుమిత్రుల్లో అభ్యర్థులెవరైనా ఉన్నారా అని ఆరా తీసింది. మన్సూర్‌పల్లి తండాకు చెందిన నీలేశ్‌, శ్రీను, వికారాబాద్‌ జిల్లా లగిచర్లకు చెందిన గోపాల్‌ ఆమెను సంప్రదించారు. వారి దగ్గర 10 నుంచి 20 లక్షల చొప్పున వసూలు చేసింది. ఈ మొత్తంలో సగం ప్రవీణ్‌కు చేరాయి. రేణుక, ఆమె భర్త ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో అభ్యర్థులు వారిని గట్టిగా నమ్మి అప్పుసప్పు చేసి డబ్బులు ఇచ్చారు. పైసలకు పేపర్లు ఇస్తున్నారని, జాబ్ గ్యారంటీ అని తేలడంతో విషయం బాగా పాకిపోయింది. ఓ అభ్యర్థి డబ్బుల విషయంలో బేరసారాలు కుదరక పోలీసులకు ఫోన్ చేయడంతో బండారం బయటపడింది.

కంప్యూటర్లు హ్యాక్ కావడం వల్ల పేపర్లు లీకయ్యాయని భావించిన భావించిన కమిషన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కమిషన్‌లోని సీసీ ఫుటేజీలను, నిందితుల ఫోన్ డేటాను సేకరించి నిందితుల బాగోతం బయటపెట్టారు.. రేణుక దంపతులు, ప్రవీణ్‌ సహా మొత్తం 13 మందిని అరెస్ట్ చేశారు. గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్‌ను కూడా ప్రవీణ్ లీక్ చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రవీణ్ ఆ పరీక్ష రాసి 150 మార్కులకు గాను 103 మార్కులు సంపాదించాడు. లీకేజీలపై పూర్తి స్థాయిలో విచారణ జరపడానికి ప్రభుత్వం సిట్‌ను నియమించింది.