అన్ని ఉద్యోగాల భర్తీ... టీఎస్ పీఎస్సీకి ఇవ్వడమే తప్పా..? - MicTv.in - Telugu News
mictv telugu

అన్ని ఉద్యోగాల భర్తీ… టీఎస్ పీఎస్సీకి ఇవ్వడమే తప్పా..?

June 6, 2017


తెలంగాణ వచ్చింది. ఉద్యోగాలు మీద ఉద్యోగాలు వస్తాయి అనుకున్నారు. స్వయంపాలనలో ఇప్పుడు అట్ల లేకపాయె. అదిగో ఇదిగో నోటిఫికేషన్లు అంటారు. తీరా వచ్చాక తలతిక్క రూల్స్. పరీక్షలు జరిగాక..ఫలితాలు వచ్చాక.. అన్ని వివాదాలే. వేసేదే కొంచెం పోస్టులు.. అందులో నిలువెల్లా నిర్లక్ష్యం.. ఎందుకిలా జరుగుతోంది. అధికారులలో సమైక్యపాలన వాసనలు పోలేదా…లేదా అనుభవలేమియే ఇందుకు కారణామా..అసలేం జరుగుతోంది కేసీఆర్ ఇలాకాలో…

తెలంగాణ వచ్చి మూడేళ్లయింది. విజయవంతంగా మూడేళ్ల సంబురాలు జరిగాయి.కేసీఆర్ హయాంలో మెరుగైన పాలన కొనసాగుతోన్నా… టీఎస్ పీఎస్సీ,విద్యాశాఖలో మాత్రం నిలువెల్లా నిర్లక్ష్యమే. కొలువుల భర్తీలో కిరికిరులే. జీవో జారీ నుంచి జాబ్ పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చేదాకా వివాదాలే. టీఎస్సీపీఎస్సీ హడావుడిగా గురుకుల నోటిఫికేషన్‌లో నిబంధనలు చూసి నిరుద్యోగులు బిత్తరపోయారు. సోయి మరిచి టీజీటీ, పీజీటీ పోస్టులకు డిగ్రీకి 60శాతం ఓసీ, బీసీ అభ్యర్థులకు, 55శాతం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అర్హతగా పెట్టి చేతులు కాల్చుకున్నారు. తీవ్ర దుమారంతో సీఎం కేసీఆర్ జోక్యం చేసుకుని రూల్స్ మార్చాలని ఆదేశించారు. ఆ తర్వాత నెలకుగానీ కొత్త నోటిఫికేషన్ రాలేదు.

గురుకుల టీచర్ల నియామక నిబంధనల్లో టెట్‌ అర్హత తప్పనిసరిగా పేర్కొన్న విద్యాశాఖ.. దాని నిర్వహణపై మాత్రం అలసత్వం ప్రదర్శిస్తూనే ఉంది. లక్షల మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్న టెట్‌ను ఏటా రెండు సార్లు నిర్వహించాలన్న ఎన్‌సీటీఈ మార్గదర్శకాలను పట్టించుకోవడం లేదు. త్వరలో పాఠశాలల్లో టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ కానున్న నేపథ్యంలో టెట్‌ నిర్వహించాలని ఉపాధ్యాయ అభ్యర్థులు డిమాండ్‌ చేస్తున్నారు. అయినా టెట్‌ నిర్వహణపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి దృష్టి పెట్టడం లేదు. ఏటా రెండు టెట్ లు కాదు.. మూడేళ్లలో ఒక్కటే మాత్రమే నిర్వహించి చాలనుకున్నారు. మరోసారి టెట్ నిర్వహించాలని నిరుద్యోగులు ఎంత మొత్తుకున్నా..సర్కార్ కు వినిపించడం లేదు. వినిపించినా టేక్ లైట్ అనుకుంటున్నారు. అసలు డీఎస్సీ టెట్ కలిపి నిర్వహించలేరా..కలిపి పెడితే సర్కార్ కు పోయేది ఏముంది. పక్క రాష్ట్రం ఏపీలో డీఎస్సీ, టెట్ లు కలిపి నిర్వహించి పోస్టుంగులు కూడా ఇచ్చేశారు రెండేళ్ల కిందటే.మరి ఇక్కడ ఏమైంది. వాళ్లకు రాని లీగల్ ప్రాబ్లమ్స్ వీళ్లకు వస్తున్నాయా…?

ఇక గ్రూప్ ఫలితాలపై వివాదం రేగింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ప్రకటించిన గ్రూప్-2 ఫలితాల్లో అవకతవకలు జరిగినట్లు పలువురు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. 1,032 గ్రూప్-2 పోస్టులకు 1:3 నిష్పత్తి చొప్పున 3, 147 మంది అభ్యర్థులను ఎంపిక చేయడం వివాదానికి దారితీసింది. జవాబుపత్రాల్లో వైట్ నర్, డబుల్ బబ్లింగ్ చేసిన వారు కూడా తాజాగా ప్రకటించిన గ్రూప్-2 రిజల్ట్స్ లో తదుపరి ఎంపిక ప్రక్రియకు సెలక్టయ్యారని అభ్యర్థులు ఆందోళనకు దిగారు. దీని వల్ల ప్రతిభగల అభ్యర్థులు అన్యాయానికి గురయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
టీఎస్ పీఎస్సీకి ఓ నిరుద్యోగి రాసిన లెటర్ ను కింద ఇస్తున్నాం…

“గౌరవనీయులైన టీఎస్ పీఎస్సీకి, తెలంగాణ ప్రభుత్వానికి మర్యాదపూర్వకంగా ఈ లెటర్ రాస్తున్నాను
టీఎస్ పీఎస్సీ గ్రూప్ 2 ఫలితాల్లో అవకతవకలు జరిగితే పట్టించుకోరా? అది మీ బాధ్యత కాదా?
• ఓఎమ్ఆర్ షీట్లో వైట్ నర్ దిద్దిన వారిని సెలెక్ట్ చేయడం మీకు ఎంత వరకు సబబుగా ఉంది?
• మీరు(టీఎస్ పీఎస్సీ) ముందుగా ఇన్ స్ట్రక్షన్స్ లో పేర్కొన్నట్లు ఓఎమ్ ఆర్ షీట్ పై దిద్దు బాట్లు చర్యలను అంగీకరించబోమని చెప్పారు..మళ్లీ మీ నిబంధనలను మీరే ఉల్లంఘించడం ఎంత వరకు కరెక్ట్ ?

• అసలు వైట్ నర్ ను సెంటర్ లోకి ఎందుకు అనుమతించారు ? అన్నీ చెక్ చేసే మీకు వైట్ నర్లు కనిపించలేదా? వందల సంఖ్యలో వైట్ నర్లున్న ఓఎంఆర్ షీట్లు ఎలా వస్తాయి? దాని వెనక మీ హస్తం ఉందా?

• కట్ ఆఫ్ లిస్ట్ పెట్టకుండా డైరెక్ట్ ఫలితాలు రిలీజ్ చేయడం వెనుక ఏమైనా ఉద్ధేశం ఉందా?

• ఒకే సెంటర్ నుంచి వందల సంఖ్యలో అభ్యర్థులు ఎలా సెలెక్ట్ అయ్యారు ? దీని వెనక ఏదైనా మతలబు ఉందా? లేదా ఆయా సెంటర్లలో మాస్ కాఫీయింగ్ జరిగిందా?

• అర్హులకు అవకాశం దక్కలేదని రోడ్లపైకి వచ్చి వేలాది మంది అభ్యర్థులు వాపోతుంటే వారి గోడు మీకు వినిపించడం లేదా?

• వైట్ నర్ దిద్దే వారి విషయంలో సుప్రీంకోర్టు తీర్పును మీరు లెక్కచేయరా? అయినా మీరు లెక్కచేసి ఉంటే వైట్ నర్ పెట్టిన వాళ్లను సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు ఎందుకు పిలుస్తారు ?

• ఎప్పుడో నవంబర్ లో పరీక్ష అయిపోతే కొంతమంది అభ్యర్థులు వైట్ నర్ విషయంలో కోర్టుకు వెళ్లారు..మరి ఆ 3 నెలల గ్యాప్ లో మీరేం చేశారు ?వాళ్లు కోర్టు మెట్లు ఎక్కేదాకా వేచిచూశారా?

• 17 ప్రశ్నలను అర్ధాంతరంగా తొలగించారు.. దానికి సంబంధించి మీరు టీఎస్ పీఎస్సీ ఎలాంటి మార్గదర్శకాలు లేవు. టీఎస్ పీఎస్సీ అంటే రాజ్యాంగ బద్ధంగా ఏర్పడ్డ సంస్థ కాబట్టి అభ్యర్థులకు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా మీకు ఉంది?
• ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు నియామకాల్లో అన్యాయం జరిగిందనే తెలంగాణను కొట్లాడి తెచ్చుకుంటిమి..ఇప్పుడు అందులో పెద్దగా మార్పేమీ కనిపించడం లేదు.దీనికి మీ సమాధానం ఏమిటి?

• మీరు ప్రైమరీ, ఫైనల్ కీ లు ఇవ్వడానికి ఎందుకంత సమయం తీసుకున్నారు? అభ్యర్థుల ఎదురుచూపులతో ఆటలాడాలనుకున్నారా? ఆ జాప్యానికి కారణాలేంటి?

• మీరిచ్చిన ప్రతి ‘కీ’ లో సవాలక్ష తప్పులున్నాయి..అంత నిర్లక్ష్యం ఎందుకు చేసినట్లు? పోనీ మీరు కొలువు దీరిన సర్కారులో కీ తయారు చేసే నిష్ణాతులు కరువయ్యారా? గ్రూప్ 2 అంటే మీ దృష్టిలో చిన్నపిల్లలు ఆడుకునే ఆటనా?

• గ్రూప్ 2 పరీక్షకు ముందు 350 మార్కులు తెచ్చుకొని చూపించండని సవాల్ చేసిన మీకు ఈరోజు 420,430,440, 450 మార్కులు తెచ్చుకున్న వాళ్లు కనిపించడం లేదా? వాళ్లను సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు ఎందుకు అనుమతించడం లేదు? అవి మార్కులు కావా? ఇప్పటికీ చాలా మంది అన్నేసి మార్కులు తెచ్చుకున్నా జాబ్ వస్తుందన్న నమ్మకం లేకుండా చేశారు.

• మీది నిజంగా మాటల ప్రభుత్వమే అని నిరూపించారు..చేతల ప్రభుత్వం కాదని ఇప్పుడు తేలిపోయింది..ప్రకటనల్లో కాదు సర్ దమ్ము చూపించాల్సింది… చెప్పిన పని చెప్పినట్లు చేయడంలో చూపించండి..

• నోటిఫికేషన్ లో 1:2 ప్రకారం ఇంటర్వ్యూకు పిలుస్తామన్నారు..మళ్లీ కొత్తగా 1: 3 ఏంటీ సర్ ?ముందుగానే ఇలాంటి విషయాలు మీడియాకు చెప్పాల్సిన బాధ్యత, ప్రెస్ నోట్ రిలీజ్ చేయాలన్న కనీస జ్ఞానం లేదా? డైరెక్ట్ గా మీరెవరు సర్ నిర్ణయాలు తీసుకోవడానికి?
చివరగా ఒక్కటి అడుగుతున్నాను సర్ మిమ్మల్ని… దమ్ముంటే పరీక్షను రద్దు చేసి ఇంకో మూడు నాలుగు నెలలు గడువిచ్చి మీరు చేసిన తప్పును సరిద్దుకోండి. లేదంటే తెలంగాణలో నియామకాల కోసం మరో ఉద్యమం తప్పదు. విద్యార్థుల భవిష్యత్తును నిర్ధేశించండి అంతే కానీ విద్యార్థుల భవిష్యత్తులతో ఆడుకోకండి..వారి జీవితాలను అంధకారం చేయకండి..అది మీ హక్కు కాదని తెలసుకోండి.
ఇట్లు

ఒక తెలంగాణ నిరుద్యోగి…
ఇప్పడు ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
టీఎస్ పీఎస్సీ వివరణ ఇలా….

ఇక గ్రూప్ 2 ఫలితాల పై వస్తున్న విమర్శలకు వివరణ ఇచ్చింది టీఎస్ పీఎస్సీ. సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారం కరెక్ట్ కాదని తెలిపింది. వైట్ నర్ వాడిన వారి పేపర్లు కూడా వాల్యుయేషన్ చేశారన్న వాదన మీద క్లారిటీ ఇచ్చింది. బయోడేటాలో తప్పులున్నయని అభ్యర్థులు అడిగారని.. దీనిమీద టెక్నికల్ కమిటీ వేసిన తర్వాత నిర్ణయం తీసుకున్నమని చెప్పింది. ఓఎంఆర్ షీట్ లో బయోడేటా పార్ట్ లో మార్పులకు మాత్రమే ఒప్పుకున్నామని.. జవాబులకు వైట్ నర్ వాడిన పేపర్లు వాల్యూయేషన్ చేయలేదని కమిషన్ తేల్చిచెప్పింది. అలాగే ఇంటర్వ్యూలకు సాధారణంగా 1:2 అభ్యర్థులను పిలవాలని… కానీ.. ఫలితాలు ఆలస్యం అయ్యాయని అందుకే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు 1:3 రేషియో ప్రకారం పిలిచామన్నారు. ఫైనల్ గా ఇంటర్వ్యూకు 1:2 ప్రకారమే పిలుస్తామన్నారు. అభ్యర్థులను ఎక్కువగా పిలిచారన్న దానిపైనా వివరణ ఇచ్చారు. PH కేటగిరీలో కొందరు రిజెక్ట్ అయ్యే అవకాశముందని… అందుకే PH కేటగిరీలో 1:5 రేషియోలో పిలిచామన్నారు. అలాగే.. సెలక్షన్ ప్రాసెస్ ముగియకముందు.. గతంలో ఎప్పుడు కూడా కటాఫ్ మార్కులు చెప్పలేదని.. ఇప్పుడు చెప్పేది లేదని తెలిపింది టీఎస్ పీఎస్సీ తెలిపింది. 17 ప్రశ్నల తొలగింపు, కీ లో తప్పులపై మాత్రం మాట్లడలేదు.

అయినా ఇచ్చినా నోటిఫికేషన్లే కొన్ని.. ఇన్ని వివాదాలు ఎందుకు వస్తున్నాయి. ఇందులో ఎవరి తప్పు ఉంది. అన్ని ఉద్యోగాల భర్తీ టీఎస్ పీఎస్సీకి ఇవ్వడమే సర్కార్ చేసిన తప్పా..ఇన్ని ఉద్యోగాలు భర్తీ చేసే సీన్ టీఎస్ పీఎస్సీకి ఉందా… చైర్మన్ ఘంటా చక్రపాణికి ఈ పరీక్షల నిర్వహణలో అనుభవం లేకపోవడమే వివాదాలకు కారణామా… ఇవన్నీ సగటు తెలంగాణవాదుల్ని తొలుస్తున్న ప్రశ్నలు.. ఇప్పటికైనా టీఎస్ పీఎస్సీపై సర్కార్ సారథి నజర్ పెట్టాలి. లేదంటే అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఏపీపీఎస్సీ కంటే దారుణంగా తయారవ్వటం పక్కా…