TSRTC allowed student bus passes for Pallvelugu and express buses
mictv telugu

బస్ పాసులపై విద్యార్ధులకు గుడ్ న్యూస్ చెప్పిన ఆర్టీసీ

November 24, 2022

టీఎస్ ఆర్టీసీ ఎండీగా ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనార్ బాధ్యతలు చేపట్టాక సంస్థను ప్రజలకు చేరువ చేసేందుకు ఎప్పటికప్పుడు నూతన ఆలోచనలతో ముందుకు వస్తున్నారు. ఆక్యుపెన్సీ పెంచి సంస్థను లాభాల బాట పట్టించే ఉద్దేశంతో మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. తాజాగా ఆయన ఆధ్వర్యంలోని టీఎస్ఆర్టీసీ విద్యార్ధులకు గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ నగరంలోని కళాశాలల్లో చదివే దూర ప్రాంతాల విద్యార్ధుల బస్ పాసుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.

నగరానికి రోజూ రాకపోకలు సాగించి చదువుకునే విద్యార్ధుల బస్ పాసులు ఇప్పటివరకు కేవలం సిటీ బస్సుల్లోనే చెల్లుబాటు అవుతుండగా, ఇక నుంచి పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లోనూ చెల్లుబాటయ్యేలా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. నగర శివార్లలో సిటీ బస్సులు తక్కువ సంఖ్యలో తిరుగుతున్నందున ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్న నేపథ్యంలో తల్లిదండ్రులు, విద్యార్ధుల విన్నపం మేరకు ఈ సదుపాయం కల్పిస్తున్నామని వెల్లడించారు. ఇక త్వరలో ఆర్టీసీలో స్మార్ట్ కార్డులు, మొబైల్ యాప్ ప్రవేశపెడతామని మార్చిలోపు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. దీనివల్ల చిల్లర సమస్యతో పాటు లెక్కల్లో తేడాలు రాకుండా ఉంటుందని సంస్థ అధికారుల ఆలోచన.