పెండ్లిళ్ల సీజన్ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) కీలక నిర్ణయం తీసుకున్నది. అద్దె బస్సులపై ప్రత్యేక రాయితీ కల్పిస్తున్నట్లు ప్రకటించింది.
టీఎస్ఆర్టీసీ అద్దె బస్సులు పై ప్రత్యేక రాయితీ కల్పిస్తున్నట్టు ప్రకటించింది. శుభకార్యాలకు అన్ని రకాల బస్సు సర్వీసులపై పది శాతం రాయితీ ప్రకటించారు. అద్దె బస్సుల పై ఈ ఏడాది జూన్ 30 వరకు 10శాతం రాయితీ అమలులో ఉంటుందని స్పష్టం చేశారు.
గతంలో.. కార్తీకమాసం, వనభోజనాలు, శబరిమల అయ్యప్ప దర్శనం సందర్భంగా బస్సు అద్దెలను ఈ సంస్థ రాయితీలు కల్పించింది. అయితే గతేడాది డిసెంబర్ 31తో రాయితీ గడువు ముగిసింది. మళ్లీ ఇప్పుడు పెండ్లిళ్ల సీజన్ మొదలైంది. దీంతో టీఎస్ఆర్టీసీ కొత్త ఆలోచన చేసింది. ఈ సీజన్ లో బస్సుల డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని 10శాతం రాయితీ కల్పించాలని క్షేత్రస్థాయి అధికారులు తెలిపారు.
టీఎస్ఆర్టీసీ చైర్మన్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ.. ‘శుభకార్యాల సమయంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా అద్దె బస్సుల పై 10శాతం రాయితీ కల్పించాము’ అన్నారు. ప్రైవేట్ వాహనాల కంటే తమ సంస్థ తక్కువ ధరకు బస్సులను అద్దెకు ఇస్తుందని పేర్కొన్నారు. ముందస్తుగా నగదు జమ చేయకుండానే ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్లు చెప్పారు.
బస్సు అద్దె బుకింగ్ కోసం ప్రయాణికులు తమ అధికార వెబ్ సైట్ www.tsrtconline.in ని సందర్శించాలని లేదా స్థానిక డిపోమేనేజర్ ని సంప్రదించాలని టీఎస్ఆర్టీసీ సూచించింది. తమ అద్దెబస్సులను శుభకార్యక్రమాలు, వివాహాలకు వినియోగించి టీఎస్ఆర్టీసీని ప్రోత్సహించాలని కోరారు. పెండ్లిళ్ల సీజన్ నేపథ్యంలో డిమాండ్ ను బట్టి అద్దె బస్సులను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.