ఆర్టీసీ డిపోల వద్దకు కార్మికులు.. సీఎం నిర్ణయంపై ఉత్కంఠ - MicTv.in - Telugu News
mictv telugu

ఆర్టీసీ డిపోల వద్దకు కార్మికులు.. సీఎం నిర్ణయంపై ఉత్కంఠ

November 22, 2019

48 రోజులపాటు సుదీర్ఘ కాలం ఆర్టీసీ సమ్మెలో పాల్గొన్న కార్మికులు ఓ మెట్టు దిగారు. ప్రభుత్వం భేషరతుగా విధుల్లోకి చేర్చుకుంటే తాము రావడానికి సిద్ధంగా ఉన్నామంటూ జేఏసీ ఇటీవల ప్రకటించింది. ఈ నేపథ్యంలో విధుల్లో చేరేందుకు కార్మికులు డిపోల వద్దకు వెళ్తున్నారు. అయితే వారిని ఎవరినీ సెక్యూరిటీ సిబ్బంది లోపలికి అనుమతించలేదు. ఉన్నతాధికారుల నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు లేవని దీనిపై స్పష్టత వచ్చాక విధుల్లోకి తీసుకుంటామని డిపో మేనేజర్లు చెప్పి పంపిస్తున్నారు. 

TSRTC Employees.

దీంతో ఆర్టీసీ కార్మికుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. సీఎం కేసీఆర్ ఈ అంశంపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది తేలాల్సి ఉంది. ఇప్పటికే ఆర్టీసిని నడవాలంటే నెలకు రూ.640 కోట్లు కావాలని, అంత శక్తి ప్రభుత్వ వద్ద లేదని సీఎం స్పష్టం చేశారు. మరి ఈ సమయంలో ఆయన తన నిర్ణయాన్ని మార్చుకుంటారా లేదా అనే చర్చ ఆర్టీసీ కార్మికుల్లో జరుగుతోంది. రెండు నెలలుగా వేతనాలు లేకుండా సమ్మెలో ఉన్న కార్మికులు ఇప్పటికే తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారు. కాగా శుక్రవారం ఆర్టీసీ సమ్మెపై కేసు విచారణకు రానుంది. మరి దీనిపై ధర్మాసనం ఎటువంటి తీర్పు ఇస్తుందో చూడాల్సి ఉంది.