ప్రయాణికులకే విస్తృత సేవలు అందిస్తున్న టీఆర్ఎస్ఆర్టీసీ.. వ్యాపారంలో కూడా రాణిస్తోంది. ప్రత్యామ్నాయ ఆదాయాల కోసం సరికొత్త మార్గాలను అన్వేషిస్తూ ముందుకు దూసుకుపోతుంది. ఇప్పటికే పెట్రోల్ బంకులు, లాజిస్ట్ బిజినెస్‌లో విజయవంతమైన టీఆర్ఎస్ఆర్టీసీ తాజాగా మరో వ్యాపారంలోకి అడుగుపెట్టి పెట్టింది. డిమాండ్ ఎక్కువగా ఉన్న డ్రింకింగ్ వాటర్ వ్యాపారంలోకి టీఎస్ఆర్టీసీ ప్రవేశించింది. ‘జీవా’ పేరుతో ప్యాకెజ్డ్ డ్రింకింగ్ ఆర్టీసీ వాటర్ బాటిళ్లు మార్కెట్లో దర్శమివ్వనున్నాయి. ఈ వ్యాపారాన్ని జనవరి 9వ తేదీ ఉదయం 11:30 గంటలకు హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్ ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించనున్నారు.
బస్టాప్స్లో విక్రయం
ఆర్టీసీ ‘జీవా’ వాటర్ బాటిళ్లు ‘స్పింగ్ ఆఫ్ లైఫ్’ అనే ట్యాగ్‌లైన్‌తో మార్కెట్లోకి వస్తున్నాయి. మొదటగా లీటర్ వాటర్ బాటిళ్లు అందుబాటులో ఉంటాయి. త్వరలోనే కార్యాలయాల్లో వినియోగించేందుకు 250 ఎంఎల్ బాటిళ్లను, తమ ఏసీ బస్సుల ప్రయాణికులకు అందజేసేందుకు అర లీటర్ బాటిళ్లను ఉత్పత్తి చేయనుంది. టీఎస్ఆర్టీసీ ఏసీ బస్సులో ప్రయాణించే ప్రయాణికులకు ఈ వాటర్ బాటిళ్లను ఉచితంగా అందించనున్నారు. బస్టాండ్‌ల్లోని స్టాళ్లలోనూ వీటిని విక్రయించి మార్కెట్ చేసుకోవాలని టీఎస్ఆర్టీసీ భావిస్తుంది. బుకింగ్ కౌంటర్లలో టికెట్లతో పాటు జీవా వాటర్ బాటిళ్లను ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ విక్రయించనుంది.బహిరంగ మార్కెట్లోనూ విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దశల వారీగా తెలంగాణ వ్యాప్తంగా ఈ వాటర్ బాటిళ్ల విక్రయాలు ఊపందుకోనున్నాయి.
స్వచ్ఛమైన నీరు
ప్రయాణికుల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా జీవా వాటర్ బాటిల్స్ అందిస్తున్నామని టీఆఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. తాగునీరు పేరుతో కల్తీ బ్రాండ్లు మార్కెట్లోకి వస్తున్నాయని చెప్పారు. ఇకనుంచి జీవా పేరుతో ఆర్టీసీ అందిస్తున్న స్వచ్ఛమయిన తాగునీటిని ప్రయాణికులు తాగవచ్చన్నారు. అన్నీ ఆర్టీసీ బస్టాండ్లలో జీవా వాటర్ బాటిళ్లు విక్రయిస్తామని..ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఆకర్షణీయంగా డిజైన్
జీవా వాటర్ బాటిల్‌ను ఆకర్షణీయంగా రూపొందించారు. ‘జీవా’ అంటే తేజస్సు, ప్రకాశం, కాంతి అని అర్థం. ఆ అర్థానికి తగ్గట్టుగానే వాటర్ బాటిల్‌ను డిజైన్ చేశారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బాటిళ్లకు భిన్నంగా డైమండ్ కట్స్‌తో జీవా వాటర్ బాటిల్‌ను డిజైన్ చేశారు. ఆ డైమండ్ కట్స్ కారణంగా లైటింగ్ పడగానే బాటిల్ మెరుస్తూ కనిపిస్తుంది.