తెలంగాణ రాష్ట్రంలోని మాతృమూర్తులకు టీఎస్ ఆర్టీసీ శుభవార్తను చెప్పింది. అంతర్జాతీయ మాతృదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 8న (ఆదివారం) తల్లులకు టీఎస్ ఆర్టీసీ గొప్ప సదావకాశాన్ని కల్పిస్తోంది. ఐదేండ్లలోపు చిన్నారులతో కలిసి తల్లులు అన్నీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని ఎండీ సజ్జనార్ ప్రకటించారు.
సజ్జనార్ మాట్లాడుతూ.. ”అమ్మ అనురాగాన్ని, ప్రేమను వెలకట్టలేము, ఆ త్యాగమూర్తుల విశిష్ట సేవలను గుర్తుచేసుకుంటూ, ఈ నిర్ణయం తీసుకున్నాం. మదర్స్ డే సందర్భంగా ఆర్డినరీ నుంచి ఏసీ వరకు అన్నీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు” అని ఆయన అన్నారు.
మరోపక్క టీఎస్ ఆర్టీసీ ప్రయాణికుల విషయంలో కొన్ని రోజులుగా ప్రత్యేక సౌకర్యాలను కల్పిస్తుంది. ఇటీవలే చిల్డ్రన్స్ డే, ఉమెన్స్ డే సందర్భంగా పలు ఆఫర్లను ప్రకటించింది. నిరుద్యోగ యువతను దృష్టిలో ఉంచుకొని, బస్ పాస్‌ల విషయంలో 20 శాతం రాయితీని కల్పించింది. పండగలకు, వేసవి సెలవులకు నడిపే ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో మాతృదినోత్సవం రోజున మహిళలకు, మాతృమూర్తులకు ఉచితంగా ప్రయాణించేలా మరో నిర్ణయం తీసుకుంది. ఈ అవకాశాన్ని మాతృమూర్తులు వినియోగించుకోవాలని ఆర్టీసీ అధికారులు కోరారు.