సంక్రాంతి పండగ కోసం సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకోసం టీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్ ప్రత్యేక ఏర్పాట్లను చేస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ నుంచి నాలుగు వేలకు పైగా బస్సులను నడపున్నట్లు ప్రకటించింది. తాజాగా మరో శుభవార్త అందించింది. ప్రయాణికులపై ఆర్థిక భారం తగ్గించేందుకు కొత్త ఆఫర్‌తో ముందుకొచ్చింది. టీఆఎస్ఆర్టీసీ బస్సుల్లో రానుపోనూ ఒకేసారి టికెట్లు బుక్ చేసుకుంటే..10 శాతం రాయితీని అందించనుంది. అయితే ఆఫర్ తిరుగు ప్రయాణానికే మాత్రమే వర్తిస్తుంది. డీలక్స్, సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ ప్లస్ బస్సుల్లో అడ్వాన్స్ రిజర్వేషన్ బుకింగ్స్ లో ప్రయాణికులు ఈ ఆఫర్‌ను పొందవచ్చు. ముందస్తు రిజర్వేషన్లు www.tsrtconline.in వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు.. ప్రత్యేక బస్సుల్లో 585 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సదుపాయం ఉంటుంది.
జనవరి 7 నుంచి 15వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు ప్రయాణాలకు అందుబాటులో ఉండనున్నాయి. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురంకు 125, కాకినాడకు 117, కందుకూరుకు 83, విశాఖపట్నం 65, పోలవరంకు 51, రాజమండ్రికి 40 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణలోని అన్ని ప్రధాన నగరాలు, పట్టణాలు కూడా పండుగ సమయంలో ప్రత్యేక బస్సుల్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సారి ఆర్టీసి బస్సుల్లో ప్రయాణాలకు రిజర్వేషన్లను 60 రోజుల ముందు నుంచే చేసుకునే అవకాశం ఉంది.