తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఒడిషాకు పది బస్సు సర్వీసులను నడపాలని ఆ రాష్ట్ర ఆర్టీసీతో అంతర్రాష్ట్ర ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు బుధవారం బస్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి సమక్షంలో ఎండీ వీసీ సజ్జన్నార్, ఒడిషా ఆర్టీసీ ఎండీ దిప్తేశ్ కుమార్ పట్నాయక్‌లు పత్రాలపై సంతకాలు చేశారు. ఒప్పందం ప్రకారం తెలంగాణ ఆర్టీసీ 10 సర్వీసులను, ఒడిషా 13 సర్వీసులను నడపనున్నాయి.
టీఎస్ఆర్టీసీ నడిపే సర్వీసులు ఇలా ఉన్నాయి
హైదరాబాద్ – జైపూర్ మధ్య 2 సర్వీసులు, ఖమ్మం – రాయగఢ 2, విజయవాడ నుంచి భద్రాచలం మీదుగా భవానిపట్న 2, భద్రాచలం – జైపూర్ మధ్య 4 సర్వీసులు నడుపనుంది. మొత్తం 10 బస్సులు ఒడిషాలో 3378 కిలోమీటర్ల మేర నడుస్తాయి.
ఒడిషా ఆర్టీసీ సర్వీసులు
నవరంగ్ పూర్ – హైదరాబాద్ 4, జైపూర్ – హైదరాబాద్ 2, భవానీపట్న నుంచి భద్రాచలం మీదుగా విజయవాడకి 2, రాయగఢ – కరీంనగర్ 2, జైపూర్ – భద్రాచలం మధ్య 3 బస్సులను నడపనుంది. మొత్తం 13 బస్సులు తెలంగాణలో 2896 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి.