సీఎం స్పందించాలి.. అశ్వత్ధామరెడ్డి, మరో కార్మికుడి మృతి - MicTv.in - Telugu News
mictv telugu

సీఎం స్పందించాలి.. అశ్వత్ధామరెడ్డి, మరో కార్మికుడి మృతి

November 22, 2019

ఆర్టీసీ జేఏసీ సమ్మె విరమణపై మళ్లీ యూటర్న్ తీసుకుంది. చాలా రోజులుగా సమ్మె చేస్తూ.. చివరకు కార్మిక సంఘం నేతలు విధుల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. కానీ రెండు రోజుల్లోనే మరోసారి తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. దీంట్లో భాగంగా రేపు అన్ని డిపోల ఎదుట సేవ్ ఆర్టీసీ పేరుతో నిరసనలు చేపట్టాలని జేఏసీ కన్వీనర్ అశ్వత్ధామరెడ్డి పిలుపునిచ్చారు. తమ నిర్ణయంపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో నేతలంతా జేబీఎస్‌లో అత్యవసరంగా సమావేశమై చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ సమావేశం తర్వాత  తిరిగి తమ నిరసనను కొనసాగించాలని జేఏసీ నేతలు నిర్ణయించారు. షరతులు లేకుండా విధుల్లోకి తీసుకోవాలంటే సీఎం స్పందించకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు కార్మికులు ఎవరూ డ్యూటీలో చేరలేదని పేర్కొన్నారు. ఇక ముందు కూడా ఎవరూ డిపోలకు వెళ్లకూడదని నిర్ణయించినట్టుగా తెలిపారు. రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టు తీర్పు వెల్లడించిన తర్వాత తమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. రేపు అన్ని డిపోల ఎదుట నిరసన  చేపట్టి.. ఆ తర్వాత తమ నిర్ణయం వెళ్లడిస్తామని చెప్పారు. 

TSRTC JAC.

మరో కార్మికుడి మృతి : 

 

ఆర్టీసీ సమస్యలు పరిష్కారం కావడంలేదని మనస్థాపంతో మరో కార్మికుడు మరణించాడు. వికారాబాద్‌ జిల్లా మండిపల్‌ గ్రామానికి చెందిన వీరభద్రయ్య(42) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. పరిగి డిపోలో డ్రైవర్‌గా ఆయన పనిచేస్తున్నాడు. జేఏసీ పిలుపుతో సమ్మెలో పాల్గొంటున్నాడు. అయినా ప్రభుత్వం దిగిరాకపోవడంతో వారం రోజులుగా అన్నం తినడం మానేశాడు. కాగా వీరభద్రయ్య మృతిని నిరసిస్తూ.. కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ సమయంలో అందులో పాల్గొన్న ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే అతన్ని చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు.