TSRTC making arrangements to ensure that passengers do not face any problems in summer.
mictv telugu

ఈ వేసవి చల్లగా ఉంటుంది.. RTC MD సజ్జనార్

February 24, 2023

వేసవిలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు.. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) ఎండీ వీసీ సజ్జనార్‌ సూచించారు. బస్టాండ్‌ల్లో తాగునీరు సదుపాయంతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఫ్యాన్లు, కూలర్లు, బెంచీలను ఏర్పాటు చేయాలన్నారు. సంస్థలోని ఇతర అంశాలపై హైదరాబాద్‌లోని బస్‌ భవన్‌ లో ఆర్‌ఎంలు, డీఎంలు, ఉన్నతాధికారులతో ఆన్ లైన్ ద్వారా నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు.

ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, వారి సమస్యలు వెంటనే పరిష్కరించాలని నిర్దేశించారు. ప్రజా రవాణా వ్యవస్థ ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. రాబోయే కాలం టీఎస్‌ఆర్టీసీకి ఎంతో కీలకమని, ఆ మేరకు అధికారులందరూ పూర్తిగా సన్నద్ధం కావాలన్నారు. సంస్థ ఆర్థిక పుష్టికి పాటుపడాలని పిలుపునిచ్చారు.

ఇక వచ్చే నెల నుంచి పెళ్లిళ్లు, శుభకార్యాలు ఎక్కువగా ఉండే నేపథ్యంలో రద్దీకి అనుగుణంగా ప్రజలకు బస్సులను అందుబాటులో ఉంచాలన్నారు. అద్దె బస్సులపై 10 శాతం రాయితీ కల్పిస్తోన్న విషయాన్ని ప్రజలకు వివరించాలని చెప్పారు. ముందస్తు రిజర్వేషన్‌కు రాయితీ కల్పిస్తున్నట్లు తెలిపారు. 31-45 రోజుల ముందు రిజర్వేషన్‌ చేసుకుంటే 5 శాతం రాయితీ, 46-60 రోజుల ముందు టికెట్‌ బుక్‌ చేసుకుంటే 10 శాతం రాయితీ ఇస్తున్నాం. ఈ ప్రత్యేక రాయితీలను సద్వినియోగం చేసుకుని సంస్థను ఆదరించాలని సజ్జనార్ తెలిపారు.