ఆర్టీసీ సమ్మె..  చరిత్రలోనే సరికొత్త రికార్డ్..  - MicTv.in - Telugu News
mictv telugu

ఆర్టీసీ సమ్మె..  చరిత్రలోనే సరికొత్త రికార్డ్.. 

October 29, 2019

TSRTC .

తెలంగాణ ఆర్టీసీ చరిత్రలో సరికొత్త రికార్డు నమోదు అయింది. అదేదో కలెక్షన్లు రాబట్టడంలోనో.. మరేదో విషయంలోనో కాదు. కార్మికులు చేస్తున్న సమ్మెలో ఇది వరకు లేని రికార్డు నమోదు అయింది. తమ డిమాండ్ల సాధన కోసం వరుసగా 25 రోజులుగా కార్మికులు సమ్మె చేపట్టారు. గతంలో చేసిన సమ్మెలన్నింటికి మించి ఎక్కువ రోజులు కార్మికులు విధుల్లోకి రాకుండా బహిష్కరించడం ఇదే ప్రథమం.

గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పుడు చంద్రబాబు హయాంలో 24 రోజులు సమ్మె చేశారు. 1967లో 20 రోజులపాటు జరిగింది. ఈ రెండు అతిపెద్ద రికార్డులను దాటుకొని తాజాగా తెలంగాణలో చేపట్టిన సమ్మె 25లకు చేరింది. అయితే తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమ సమయంలో కార్మికులు 27 రోజులు విధులు బహిష్కరించారు. కానీ ఇది కార్మికుల డిమాండ్ కోసం చేసింది కాకపోవడంతో.. ప్రస్తుతం జరుగుతున్నసమ్మె ఎక్కువ రోజులు జరిగినట్టుగా కార్మికులు చెబుతున్నారు. ఇప్పటికే దీనిపై హైకోర్టులో విచారణ జరుగుతూనే ఉంది. కార్మికులు, ఆర్టీసీ యాజమాన్యం రెండు పట్టుదలకు పోవడంతో ఇంకా ఈ అంశం కొలిక్కి రావడం లేదు. ముందు ముందు ఈ అంశం ఇంకా ఎలా ఉండబోతోందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.